తిరుపతి అర్బన్: కలెక్టరేట్ కార్యాలయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో పలువురు ప్రైవేటు వ్యక్తులు పగటి సమయంలోనే కాకుండా రాత్రి వేళ్లలోనూ వాహనాలను పార్కింగ్ చేసి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో గతంలో పలువురు ఉద్యోగుల వాహనాలు చోరీ జరిగాయి. దీంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అలాగే గతంలో మద్యం సీసాలు సైతం పార్కింగ్ ప్రదేశంలో ఎక్కడిపడితే అక్కడ దర్శమనిస్తుండేవి. వాటిని కొంత మేరకు అదుపు చేసినప్పటికీ ప్రైవేటు వాహనాల పార్కింగ్‌కు మాత్రం అడ్డుకట్టవేయలేకపోతున్నారనే పలువురు విమర్శలు చేస్తున్నారు.
చౌకదుకాణాల్లో
కందిపప్పు కరువే..
తిరుపతి అర్బన్: చౌకదుకాణాల్లో కార్డుదారులకు చంద్రబాబు బాలనలో కందిపప్పు కరువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు చూస్తే కేవలం రెండు నెలల్లో మాత్రమే కందిపప్పును కార్డుదారులకు అందించారు. దాదాపుగా 20 నెలలుగా కందిపప్పు రేట్లు పెరిగాయంటూ పంపిణీ చేయడం లేదు. కేవలం బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. గత ప్రభుత్వంలో కందిపప్పును క్రమం తప్పకుండా అందించేవారు. అలాగే బియ్యం, చక్కెర, గోధుమపిండి, రాగిపిండి తదితర పలు వస్తువులను నామమాత్రపు ధరలకు అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి.
1300 మొక్కల పెంపకం
శ్రీకాళహస్తి రూరల్: మండలంలోని సుబ్బానాయుడు కండ్రిగ పంచాయతీలో 5 ఎకరాల విస్తీర్ణంలో స్వర్ణముఖి ఆశ్రమ స్థాపనలో భాగంగా ఆ ఆశ్రమ వ్యవస్థాపకుడు కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం 1300 మొక్కలను నాటారు. వాటికి నీరందించడానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆశ్రమాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకుడు కిరణ్ మాట్లాడుతూ వ్యాపార రీత్యా 25 ఏళ్లు కాలిఫోర్నియాలో ఉండి, జన్మభూమిపై మమకారంతో తిరిగి ఇక్కడకు వచ్చి ఆధ్యాత్మిక ధోరణిలో ఆశ్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. ఇందులో భాగంగా 1300 మొక్కలు నాటామన్నారు. భవిష్యత్తులో ఆశ్రమానికి వచ్చే వారికి ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు, ధ్యాన మందిరం, యోగ ఓపెన్ ఆడిటోరియం, కుటీరాలు నిర్మించునున్నామని తెలిపారు.
ఆటోను ఢీకొన్న ప్రైవేటు స్కూల్ వ్యాను
చంద్రగిరి: ప్రైవేట్ స్కూలు వ్యాను ఆటోను ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రం గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం చంద్రగిరిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఏజీపల్లికి చెందిన చంద్రబాబు(45) గ్రామంలోని బంధువు అంత్యక్రియలకు హాజరయ్యాడు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ నుంచి తమ బంధువు మంగళంపేటకు చెందిన చెంగల్రాయులును చంద్రగిరిలో దింపేదుకు ఆటోలో చంద్రగిరికి పయనమయ్యారు. ఆటోకు డీజిల్ పట్టుకుని వస్తున్న క్రమంలో నాగాలమ్మ ఆలయ సమీపంలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై ఎదురుగా వస్తున్న ఓ స్కూల్ వ్యాను ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా.. ఆటోలో ఉన్న చంద్రబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన చెంగల్రాయులును 108 వాహనంలో తిరుపతి రుయాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, ప్రమాదాన్ని పరిశీలించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


