సమస్యలు పరిష్కారం చేయమంటే అరెస్ట్‌లు చేస్తారా? భగ్గుమంటున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు
తిరుపతి అర్బన్: ఇదేమి రాజ్యం చంద్రబాబు...సమస్యలు పరిష్కారం చేయడం తెలియదు కానీ అరెస్టు మాత్రం చేయడం ఏమిటని సీఐటీయూ నేతలు, అంగన్‌వాడీ నేతలు పోలీసులను ప్రశ్నించారు. సోమవారం విజయవాడలో నిరసనలు చేపట్టిన క్రమంలో రాత్రి సమయంలో విద్యుత్ సరఫరా తొలగించి, అంగన్‌వాడీ రాష్ట్రస్థాయి నేతలను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు మంగళవారం జిల్లా వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని 14 ప్రాజెక్టుల పరిధిలో అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రభుత్వం తీరుపై భగ్గుమన్నారు. వారికి సీఐటీయూ నేతలు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులు అంగన్‌వాడీ కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. రెండేళ్లు గడుస్తున్నా ఒక్కటంటే ఒక్క సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదని పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన తమ యూనియన్ నేతలను వెంటనే వదలిపెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.


