రైతు కష్టం.. దళారి ఇష్టం | - | Sakshi
Sakshi News home page

రైతు కష్టం.. దళారి ఇష్టం

Mar 4 2026 7:16 AM | Updated on Mar 4 2026 7:16 AM

గిట్టుబాటు కాక రైతుల ఆవేదన

మిల్లర్లకు అమ్ముకోవాల్సిన దుస్థితి

ఇదే అదునుగా చేతివాటం ప్రదర్శిస్తున్న దళారులు

దేశానికి అన్నం పెట్టే రైతు నోట్లోకి నాలుగు వేళ్లు సక్రమంగా వెళ్లలేని దుస్థితి దాపురించింది. ఆరుగాలం కష్టించి పండించిన పంటను దర్జాగా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. అండగా నిలవాల్సిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించింది. అరకొర ధరలు నిర్ణయించి తూతూమంత్రంగా కొనుగోలు చేస్తోంది. మార్కెట్‌ కంటే తక్కువ రేటుకే ధాన్యం సేకరిస్తోంది. దీంతో అన్నదాతలకు దళారులను ఆశ్రయించడం తప్పనిసరిగా మారింది. ఇదే అదునుగా మిల్లర్లతో మిలాఖత్‌ అయిన మధ్యవర్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తూకం నుంచే మోసాలకు పాల్పడుతున్నారు. పైగా రైతులకు సకాలంలో ధాన్యం డబ్బులను చెల్లించకుండా కాలయాపన చేస్తూ వేధిస్తున్నారు.

శ్రీకాళహస్తి రూరల్‌: నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ డివిజన్‌ పరిధిలో రైతులు తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. తాము పండించిన ధాన్యాన్ని నేరుగా అమ్ముకోలేక దళారీల చేతుల్లోకి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఒక బస్తా ధాన్యానికి రూ.1,750 మాత్రమే మద్దతు ధర నిర్ణయించింది. ఈ క్రమంలో గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో రేటు ఎక్కువగా ఉందని వెల్లడిస్తున్నారు. దీంతో దళారులు, రైస్‌ మిల్లర్లకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ఈ మేరకు దళారులు, మిల్లర్లు యథేచ్ఛగా రైతులను మోసం చేస్తున్నారు. తూకంలో అవకతవకలకు పాల్పడుతున్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి నగదు చెల్లింపుల్లో సైతం అన్నదాతలను వేధిస్తున్నారు. అవసరాలకు అందించకుండా విడతల వారీగా చెల్లిస్తున్నారు. దీంతో తక్కువ రేటుకు ప్రభుత్వానికి అమ్ముకోలేక, దళారుల చేతిలో రైతులు దగా పడుతున్నారు.

గతంలో ఇలా..

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఓపెన్‌ మార్కెట్‌కు అవకాశం కల్పించారు. రైతులు తాము పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వచ్చి కళ్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసుకునేవారు. రైతులకు వెంటనే పూర్తిస్థాయిలో డబ్బులు అందేవి. పంట పెట్టుబడి పోను నాలుగు రాళ్లు మిగిలేవి. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. రైతులు అమ్మితే ప్రభుత్వానికి లేదా దళారులు, మిల్లర్లకు విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో అన్నదాతలకు పెట్టుబడి సంగతి దేవుడెరుగు.. అప్పుల భారం తడిసిమోపెడవుతోంది.

చేమూరులో కల్లాంలో ధాన్యం రాశి

చేమూరులో జరుగుతున్న వరి కోతలు

తిప్పుకుంటూనే ఉన్నారు

నేను 15 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. ప్రభుత్వం ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర కల్పించలేదు. దీంతో దళారులకే పంట అమ్ముకున్నా. వారు సకాలంలో నగదు ఇవ్వడం లేదు. గత ఏడాది రూ.5 లక్షలకు ధాన్యం విక్రయిస్తే ఇప్పటికి కేవలం రూ.3 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన మొత్తానికి తిప్పుకుంటూనే ఉన్నారు. పెట్టుబడికి చేసిన అప్పులకు మాత్రం వడ్డీలు కట్టుకుంటూనే ఉన్నా. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలి. – మునిచంద్రారెడ్డి,

రైతు, తొండమాన్‌పురం, శ్రీకాళహస్తి మండలం

అన్నదాతకు అందని ‘మద్దతు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement