నాకు 2 ఎకరాల పొలం ఉంది. 10 ఎకరాలు కౌలుకు తీసుకుని సన్నర కం వరి సాగు చేస్తున్నా. సన్న రకాలను ప్రభుత్వం రూ.1,750 కొనుగోలు చేస్తోంది. మార్చిలో మా పంట కోతకు వస్తుంది. అప్పటికి ఈ ధరైనా ఉంటుందో లేదో తెలియదు. ఎరువుల రేటు మాత్రం ఏటా పెరుగుతోంది. ధాన్యం ధర మాత్రం నిలకడ ఉండడం లేదు. మరీ కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతేరాజు అంటారు కానీ, ఈ ప్రభుత్వంలో రైతు అడుక్కుని తినే పరిస్థితి వచ్చేలా ఉంది. – గురవారెడ్డి,
రైతు, చేమూరు, తొట్టంబేడు మండలం
గిట్టుబాటు ధర కల్పించాలి..
నాకు 3 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాలు కౌలుకు తీసుకొని ధాన్యం పండిస్తున్నా. ప్రభుత్వం కనీసం రూ.2 వేలకు బస్తా కొనుగోలు చేస్తే మేము అప్పుల బారిన పడకుండా బయట పడతాం. గత ఏడాది ఎకరాకు పెట్టుబడి రూ.30 వేలు అయితే, ఈ ఏడాది రూ.40 వేలు దాటింది. అయితే రెండేళ్ల ముందు బస్తా ధాన్యం ధర రూ.2,100 ఉంటే, ఇప్పుడు రూ.1,750కి పడిపోయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి.
– వెంకటనారాయణ, రైతు, దిగువ వీధి,
తొండమాన్ పురం, శ్రీకాళహస్తి మండలం
మోసపోతున్నాం
నాకు 5 ఎకరాల పొలం ఉంది.5 ఎకరాల్లో సన్న రకాల వరి సాగు చేశా. ప్రభుత్వం నిర్ణయించిన ధర చాలా తక్కువ ఉండడంతో దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోడౌన్లు ఉంటే మంచి రేటు వచ్చే వరకు నిల్వ చేసుకునేవాడిని. ఇప్పుడు ఇంట్లో ఉంచుకుందామంటే రెండు రోజులకే పంట దెబ్బతింటుంది. దీంతో చేసేది లేక దళారులను ఆశ్రయిస్తున్నాం. తెలిసి తెలిసి మోసపోతున్నాం.
– శంకరయ్య, రైతు,
విరూపాక్షిపురం, తొట్టంబేడు మండలం


