పాలిటెక్నిక్‌.. ఉపాధికిపునాది | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌.. ఉపాధికిపునాది

Mar 4 2026 7:16 AM | Updated on Mar 4 2026 7:16 AM

● పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ● పాలిసెట్‌కు వచ్చేనెల 4 వరకు గడువు.. ఏప్రిల్‌ 25న పరీక్ష ● ఎస్వీ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశ పరీక్షకు ఉచిత కోచింగ్‌

పాలిటెక్నిక్‌.. ఇది పేదలకు ఇంజినీరింగ్‌ వంటిది. మధ్యతరగతి, పేద విద్యార్థులు ఆసక్తి చూపే విద్య. 19 ఏళ్లకే ఉపాధి చూపే కోర్సు. పదో తరగతి పూర్తయితే పాలిటెక్నిక్‌ చేరవచ్చు. డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసే వారికి ఉపాధి అవకాశాలకు ఢోకా ఉండదు. ప్రస్తుతం పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కోర్సు వివరాలపై ప్రత్యేక కథనం.

తిరుపతి సిటీ: పదో తరగతి పూర్తి కాగానే మనకు ఇంటర్మీడియట్‌ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత నీట్‌, ఎంసెట్‌ తదితర పోటీ పరీక్షలు రాసి మెడిసిన్‌, ఇంజినీరింగ్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తాం. కానీ పది తర్వాత పాలిటెక్నిక్‌ బాట పడితే తక్కువ వ్యయంతో అతి తక్కువ సమయంలో సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చు. మూడు, నాలుగేళ్లలోనే మంచి వేతనాలతో ఉన్నతమైన ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందవచ్చు. దీంతో పాటు ఉన్నత టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ వైపు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పలు పాలిటెక్నిక్‌ డిప్లొమో కోర్సుల్లో చేరేందుకు పాలిసెట్‌–2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

దరఖాస్తు చేసుకోవడం ఇలా..

పది ఉత్తీర్ణులైన విద్యార్థులతోపాటు, ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు హాజరయ్యేందుకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు పాలిసెట్‌ ప్రవేశ పరీక్షకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు httpr://poycetap.a p.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ, బీసీ కేటగిరీ విద్యార్థులు దరఖాస్తు ఫీజు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఏప్రిల్‌ 4వ తేదీలోపు పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది

వచ్చేనెల 25న పాలిసెట్‌ పరీక్ష

పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వచ్చేనెల 25వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో తిరుపతితో పాటు ఈ ఏడాది నూతనంగా శ్రీకాళహస్తి, రేణిగుంట, పుత్తూరు, నగరి పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.30 గంటల పాటు జరిగే పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ఇందులో గణితం 50, ఫిజిక్స్‌ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు ఉంటుంది.

జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల వివరాలు

కళాశాల కోర్సుల సంఖ్య సీట్ల సంఖ్య

ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల,తిరుపతి 7 528

పిల్లారికుప్పం, నగిరి 4 252

సత్యవేడు ప్రభుత్వ పాలిటెక్నిక్‌, సత్యవేడు 4 246

ఎస్పీడబ్ల్యూ పాలిటెక్నిక్‌, తిరుపతి 3 115

చంద్రగిరి ప్రభుత్వ పాలిటెక్నిక్‌,చంద్రగిరి 2 132

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఓబులవారిపల్లి 2 66

పాలిసెట్‌కు ఉచిత కోచింగ్‌.. మెటీరియల్‌

పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉచిత కోచింగ్‌, మెటీరియల్స్‌ ఇవ్వడం జరుగుతుంది. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చేనెల 2వ తేదీ నుంచి 22 వరకు ఉచిత కోచింగ్‌ ఇవ్వనున్నారు. పాలిటెక్నిక్‌ విద్య పూర్తి చేసిన వారికి పేరొందిన ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో సత్వరం మంచి ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు లేటరల్‌ ఎంట్రీతో బీటెక్‌ ద్వితీయ ఏడాదిలో ప్రవేశం పొందవచ్చు. ఇందుకోసం ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు.

– డాక్టర్‌ ద్వారకనాథ్‌రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్‌, ప్రిన్సిపల్‌, ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, తిరుపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement