భూ ఆక్రమణలకు తెరపడేదెప్పటికో? | - | Sakshi
Sakshi News home page

భూ ఆక్రమణలకు తెరపడేదెప్పటికో?

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

భూ ఆక

భూ ఆక్రమణలకు తెరపడేదెప్పటికో?

పుల్లంపేట: కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరినప్పటి నుంచి మండలంలో భూ ఆక్రమణలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మండలంలో ప్రధానంగా కొమ్మనవారిపల్లె, డొండ్లోపల్లె, తిప్పా యపల్లె, అనంతసముద్రం రెవెన్యూ గ్రామాల్లో కూటమి నాయకులు అత్యధికంగా భూఆక్రమణలకు తెరలేపారు. ఇప్పటి వరకూ రికార్డుల ప్రకారం మండలంలో దాదాపు 2 వేల ఎకరాలకు పైగా కబ్జారాయుళ్ల చెరలో ప్రభుత్వ భూములు ఉన్నా యని రెవెన్యూ వర్గాలే చర్చించుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖాళీ జాగాలనే కాకుండా గ్రామంలో లేని వ్యక్తుల భూములు సైతం ఆక్రమించేస్తున్నారు. యువనాయకులు కొందరు అత్యుత్సాహంగా ఆక్రమణలకు పాల్పడితే దొండ్లోపల్లెకు చెందిన ఓ సీనియర్‌ నాయకుడు సరికొత పద్ధతిలో కబ్జాకు నాంది పలికాడు. దొండ్లోపల్లె రెవెన్యూ గ్రామంలో సర్వేనంబర్‌ 223లో వంక, కుంటను ఆనుకుని ఉన్న భూమిని తనదిగా పేర్కొంటూ నిరక్ష్యరాస్యులైన దళితులను నమ్మించి అమ్మకానికి పెట్టి అందినకాడికి దండుకున్నాడు. ఆ భూములకు సంబంధించి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోగా తనదేనని నమ్మపలికి అమ్మేశాడు. అంతటితో ఆగక భూమి పక్కనే ఉన్న కుంటను, కాలువ పొరంబోకును సైతం జేసీబీలతో చదును చేయించి, అమ్మివేశాడు. అనంతరం కొనుగోలు చేసిన నిరుపేద దళిత రైతులు మంగళవారం సాయంత్రం సంబంధిత భూమిలోకి వెళ్లి భూమిని చదును చేసి హద్దుల కోసం బండలను నాటే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని హెచ్చరికలు జారీ చేసి, ఇది ప్రభుత్వభూమి ఎవరికీ ఎలాంటి అధికారాలు లేవని సంబంధిత భూముల నుంచి వైదొలగాలని ఆదేశించారు. కానీ తెల్లారేసరికి కబ్జారాయుడు కబ్జాస్థలంలో దాదాపు రెండువందల స్తంభాలను నాటించి భద్రపరచాడు. ఉదయం రెవెన్యూ అధికారులు కూలీలను తీసుకెళ్లి తొలగించే ప్రయత్నం చేయగా సాధ్యం కాకపోవడంతో జేసీబీలను ఆశ్రయించాల్సివచ్చింది. అప్పటికే పక్క గ్రామం కొమ్మనవారిపల్లెకు చెందిన మరో కబ్జారాయుడు కూటమి చోటా నాయకుడితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు జేసీబీలను ఆక్రమిత స్థలంలోకి వెళ్లనీయకుండా సర్దుబాటు చేసుకున్నారు. బుధవారం ఆక్రమితభూమిలోకి వెళ్లి పరిశీలించగా రెవెన్యూ అధికారులు నివ్వెరపోవడం వారివంతైంది. రాత్రికి రాత్రి రెండు వందల స్తంభాలను నాటడంపై ఆశ్చర్యంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఏఓలతో కలిసి తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో జేసీబీ యజమానులకు ఫోన్‌లు చేసి ఘటనాస్థలికి రమ్మని కోరగా ఎవరూ అందుబాటులో లేకపోవడం స్థానికులు సైతం స్థానిక కూటమి నాయకులకు బెదిరి, రెవెన్యూ అధికారులకు సహకరించలేకపోయారు. దీంతో తహసీల్దార్‌ ఆదేశాల మేరకు ఆర్‌ఐ రాజశేఖర్‌, వీఆర్‌ఓ రాఘవ, సర్వేయర్‌ శ్రీలేఖలు గురువారం జేసీబీలతో వచ్చి హద్దురాళ్లను తొలగించి, సూచికబోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

భూ ఆక్రమణలకు తెరపడేదెప్పటికో? 1
1/1

భూ ఆక్రమణలకు తెరపడేదెప్పటికో?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement