ఆదర్శ సౌమ్యం!
పుత్తూరు: సంప్రదాయల పేరుతో మహిళలకు పరిమితులు విధిస్తున్న సమాజంలో ఈ సంఘటన నూతన సందేశాన్ని ఇస్తోంది. పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే కాదు పుత్రిక సైతం ఆ బాధ్యతను నెరవేర్చగలదు అంటూ ఓ కుమార్తె తన తండ్రికి అంతిమ సంస్కరణలు నిర్వహించిన ఘటన అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ ఘటన బుధవారం వడమాలపేటలో చోటుచేసుకొంది. వడమాలపేటకు చెందిన ఎస్.మునిశేఖర్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. ఆయనకు భార్య సంధ్యాలక్ష్మి, సౌమ్య, హిమజ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనారోగ్యంతో మంగళవారం మునిశేఖర్ మృతి చెందాడు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రికి తలకొరివి పెట్టాల్సింది కుమారుడు. అయితే కుమారుడు లేని ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీంతో పెద్ద కుమార్తె సౌమ్య తన తండ్రికి తలకొరివి పెడతానంటూ ముందుకొచ్చింది. అంతిమ యాత్రలో అన్నీ తానై వ్యవహరిస్తూ తండ్రిని అశ్రునయనాలతో సాగనంపింది. సౌమ్య సాహసోపేత నిర్ణయానం బంధు మిత్రులకు సైతం కంటతడి పెట్టించింది. నేటి మహిళలు విద్య, ఉద్యోగం, నాయకత్వంలో మాత్రమే కాకుండా కుటుంబ బాధ్యతలను సైతం ముందుండి నడిపించగలరని సౌమ్య నిరూపించింది.


