నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు

నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు

తిరుపతి క్రైం: ఐపీఎస్‌ అధికారిగా నటిస్తూ ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.1.50 లక్షలు దోచుకున్న కేటుగాడిని తిరుపతి అలిపిరి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రామ్‌కిషోర్‌ మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. తిరుపతి ఆటోనగర్‌, విశాలాంధ్ర వీధికి చెందిన చింతా వెంకటేశ్వరరావు (30) ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అదనపు ఆదాయం కోసం ఖాళీ సమయాల్లో రాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం రాపిడో ద్వారా కే.సురేష్‌కుమార్‌ అలియాస్‌ సూర్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను ఢిల్లీలోని ఎన్‌ఐఏలో పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారి అని, తాజాగా పదోన్నతి పొంది హైదరాబాద్‌కు బదిలీ అయ్యానని చెప్పి వెంకటేశ్వర్లును నమ్మించాడు. ప్రస్తుతం తిరుపతిలో సెలవులో తన పిన్ని ఇంట్లో ఉంటున్నానని చెప్పాడు. తన పరిచయాలు, ప్రభావాన్ని ఉపయోగించి హైదరాబాద్‌ ఆదాయపన్ను కార్యాలయంలో డివిజనల్‌ అడ్వైజర్‌ పోస్టును ‘రీప్లేస్‌మెంట్‌ కోటా’లో ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఉద్యోగం ఆశతో అతడి మాటలను నమ్మిన వెంకటేశ్వరరావు, విడతల వారీగా పేటీఎం, ఫోన్‌ పే ద్వారా మొత్తం రూ.1.50 లక్షల నగదును బదిలీ చేశాడు. డబ్బులు అందుకున్న తర్వాత నిందితుడి ప్రవర్తన అనుమానాస్పదంగా మారింది. గట్టిగా అడిగితే ‘‘చేయగలిగింది చేసుకో’’ అంటూ బెదిరించాడు. దీంతో బాధితుడు అలిపిరి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి బుధవారం అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement