ఆర్థిక వ్యవస్థ బలోపేతం
వాణిజ్య ఉపగ్రహాలతో..
సూళ్లూరుపేట : వాణిజ్య ఉపగ్రహ ప్రయోగాలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. సోమవారం షార్‌లోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మకుమార్ మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా స్పేస్ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయులను, అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందో మహానుభావులు ప్రాణత్యాగాల ఫలితాలను మనం అనుభవిస్తున్నామన్నారు. యువత బాగా చదువుకుని దేశానికి ఉపయోగడే సైంటిస్టులుగా తయారు కావాలని కోరారు. యువభారత్ రాబోయే 25 ఏళ్లలో శక్తివంతమైన దేశంగా మారుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో ఇస్రో అర్థవంతమైన పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. ఎల్‌వీఎం3 రాకెట్ల ద్వారా 5 టన్నుల నుంచి 6 టన్నుల ఉపగ్రహాలను సునాయాసంగా ప్రయోగిస్తోందని వివరించారు. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లి క్షేమంగా తిరిగి వచ్చి మనదేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడారు. కార్యక్రమంలో సీఐఎస్‌ఎప్ కమాండెంట్ సంజిత్‌కుమార్ అసిస్టెంట్ కమాండెంట్ నిధి, షార్ ఎంఎస్‌ఎం డైరెక్టర్ గోపీకృష్ణ పాల్గొన్నారు.
ఆర్థిక వ్యవస్థ బలోపేతం


