నదిలో మునిగిపోయి ఇద్దరి మృతి
చిట్వేలి:చిట్వేలి గుంజన నదిలోకి సోమవారం సాయంత్రం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ఇద్దరు మృతిచెందినట్లు ఎస్‌ఐ వినోద్‌కుమార్ తెలియజేశారు. తిరుపతి నెహ్రూ నగర్‌కు చెందిన షేక్ అప్రిద్ (30) తన కుమార్తె పుట్టెంట్రుకలు తీయించడానికి శనివారం రాత్రి చిట్వేలిలోని షేక్ సయ్యద్ సాదక్ వల్లి దర్గాకు సుమారు 15 మంది బంధువులతో చేరుకున్నారు. ఆ రాత్రి అక్కడే బసచేసి ఆదివారం పుట్టెంట్రుకలు తీయించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కొందరు తిరుపతికి వెళ్లిపోగా ఇద్దరు ఇక్కడే ఉండిపోయారు. షేక్ ఆసిస్ (14), నూరుల్లా (36) సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో దర్గాకు దగ్గరలోని గుంజన నదిపై ఉన్న హైలెవల్ బ్రిడ్జి కిందకు పోయారు. ఈతకోసం బాలుడు ఆసిస్ నీటిలోకి దిగాడు. ఈతరాక మునిగిపోతుండగా బాలుడికి దగ్గర బంధువు అయిన నూరుల్లా కాపాడడానికి నీటిలోకి దిగి ఈత రాకపోవడంతో ఆయన కూడా మునిగిపోయి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ వినోద్ కుమార్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను రైల్వేకోడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సార్టెంట్ దేవరాజ్ హఠాన్మరణం
తిరుపతి సిటీ : ఉమ్మడి చిత్తూరు జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్, రాష్ట్ర అసోసియేషన్ కోశాధికారి విశ్రాంత ఎయిర్‌ఫోర్స్ సార్జెంట్ ఎస్.దేవరాజ్ (64) సోమవారం హఠాన్మరణం చెందారు. చంద్రగిరి మండలం తొండవాడ సమీపంలోని బాలాజీనగర్ లేఔట్‌లో నివసిస్తున్న ఆయన సోమవారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. దేవరాజు కుటుంబంలో రెండు రోజుల్లోనే రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. దేవరాజ్ అక్క భర్త డేనియల్ శనివారం ఉదయం మృతి చెందడం గమనార్హం. వెంట వెంటనే రెండు విషాదాలు వాటిల్లడంతో కుటుంబీకులు తల్లడిల్లిపోతున్నారు.
ఎయిర్‌ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నివాళి
సార్జెంట్ దేవరాజ్ భౌతికకాయానికి ఎయిర్‌ఫోర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి చాప్టర్ వారు ఘనంగా నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ జెండాను కప్పి అంజలి ఘటించారు. దేశానికి, క్రీడారంగానికి దేవరాజ్ చేసిన సేవలను కొనియాడారు. సంఘం సభ్యులు ఏఎస్‌బీ ప్రసాద్, బాలాజీ, ఎస్‌ఎస్ రెడ్డి, ఎస్‌ఎమ్‌కే కృష్ణమూర్తి, ఎస్‌బీన్ స్వామి, పి.సుధాకర్, సిద్ధయ్య, గిరిధర్‌సింగ్, సురేష్ కుమార్, జనార్ధన్, రత్న కుమార్, హర్షవర్ధన్‌రెడ్డి, డేవిడ్ రాజు పాల్గొన్నారు.
హత్య కేసులో నిందితుడికి రిమాండ్
సాక్షి టాస్క్‌ఫోర్స్ : పాకాల మండలం దామలచెరువుకు చెందిన అశోక్ అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడు విష్ణువర్ధన్‌కు సోమవారం పాకాల కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు నిందితుడిని చిత్తూరు జైలుకు తరలించారు.
నదిలో మునిగిపోయి ఇద్దరి మృతి


