కల్తీ ఎక్కడ బాబూ?
కార్వేటినగరం: తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు మత విధ్వేషాలు రగిల్చి ఓ వర్గాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దూరం చేయాలన్న కుట్రకు కూటమి ప్రభుత్వం ఆజ్యం పోసిందని మాజీ డెప్యూటీ మాజీ నారాయణస్వామి ధ్వజమెత్తారు. సోమవారం పుత్తూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూలో ఎలాంటి కల్తీ జరగకపోయినా దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించి డైవర్షన్ రాజకీయాలు చేసినట్లు చెప్పారు. తీరా కల్తీ జరగలేదని తేలుతుండడంతో ఇప్పుడు పామాయిల్ వాడినట్లు కొత్త నాటకారానికి తెరదీశారన్నారు. లడ్డూ ప్రసాదంపై కూటమి నేతలు చేసిన ప్రచారం ఏరోజుటికై నా అవాస్తవమని తేలుతుందని, ఆ రోజు వారికి శిక్ష పడడం ఖాయమని స్పష్టం చేశారు. దేవుళ్లకు కులాలను అంటగట్టి రాజకీయ లబ్ధిపొందాలన్న దురాలోచన కూటమి నేతలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో పేదలకు ఉచితంగా 1.5 సెంటు ఇంటి స్థలాన్ని ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేపడితే దాన్ని కూడా వక్రీకరించారన్నారు. నేను అధికారంలోకి వస్తే మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని ప్రజలను నమ్మబలికినట్లు గుర్తు చేశారు.
పేదల సంక్షేమం కోసం వెచ్చించకూడదా?
రూ.కోట్ల ప్రజాధనాన్ని ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు వెచ్చించే బదులు పేద ప్రజల సంక్షేమం కోసం ఎందుకు వెచ్చించకూడదని నారాయణస్వామి ప్రశ్నించారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపించారు. తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఎల్‌ఆర్‌పేట కొండను తచ్చూరు రోడ్డు పేరుతో భారీగా తవ్వకాలు జరిపి రోజూ వందల టిప్పర్లలో గ్రావెల్‌ను చైన్నెకి తరలించి రూ. కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపించారు. ఇక్కడ జరుగుతున్న దోపిడీలు జిల్లా కలెక్టర్‌కు తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మైనింగ్ శాఖలో ఓ అధికారి కూటమి నేతలతో చేతులు కలిపి ఈ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని చంద్రబాబును కోరారు.
చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నంలో గీతం ప్రైవేటు యూనివర్సిటీకి అప్పనంగా 54.73 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెడుతున్నట్లు నారాయణస్వామి తెలిపారు. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరంచేసి పేదలను ఉన్నత విద్యకు దూరం చేసినట్లు గుర్తుచేశారు. గతంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను తీసుకొస్తే దానిపై కూడా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
ప్రయివేటు వర్సిటీకి ప్రభుత్వ భూములా?


