నేడు తిరుమలలో రథసప్తమి
తిరుమల :వేంకటేశ్వరస్వామివారి రథసప్తమి మహోత్సవాన్ని ఆదివారం తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాటు పూర్తి చేసింది. రథసప్తమి సందర్భంగా సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు మలయప్పస్వామి సప్త వాహనాల్లో విహరిస్తూ భక్తకోటిని మంగళవారం అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంతోపాటు మాడ వీధుల్లో 10 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50 వేలు కట్ ఫ్లవర్స్‌తో అలంకరించారు.
రథసప్తమి పర్వదినానికి విస్తృత ఏర్పాటు
తిరుమలలో రథసప్తమి పర్వదినం నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తులకు గ్యాలరీల్లో, మాతశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతోపాటు పీఏసీలో అన్నదానం నిర్వహిస్తారన్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్య ప్రభ వాహనం, 9 నుండి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, 11 నుంచి 12 గంటల వరకు గరుడవాహనం, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు హనుమంత వాహనం, అనంతరం 3 గంటల వరకు చక్రస్నానం కార్యక్రమం జరుగుతుందన్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్షవాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవ జరుగుతుందన్నారు.
విద్యుత్ దీపాల వెలుగులో శ్రీవారి ఆలయం
భారీగా తరలి వస్తున్న భక్తులు
వరుస సెలవుల నేపథ్యంలో తిరుమల రథసప్తమి ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుపతిలో ప్లాటెడ్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌ఓ) టోకెన్లు జారీ చేయకపోవడంతో భక్తులు నేరుగా సర్వదర్శనం క్యూలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల క్యూ శనివారం సాయంత్రానికి తిరుమలలోని సేవాసదన్ వరకు ఉంది. వీరికి శ్రీవారి దర్శనం 16 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 60,726 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ. 1.12 కోట్లు లభించాయి. గదుల కోసం రద్దీ కొనసాగుతోంది.


