తల్లిదండ్రుల చెంతకు చేరిన చిన్నారి
తిరుపతి క్రైమ్: నగరంలో ఈ నెల 21వ తేదీన కిడ్నాప్ అయినా బాలికను ఈస్ట్ పోలీసులు సురక్షితంగా శనివారం తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు ఆధ్వర్యంలో లాండర్ అడిషనల్ ఎస్పీ రవి మనోహర్ ఆచారి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. చింతలచేనులో నివాసం ఉంటున్న సుజిత్ర, ఆమె భర్త మస్తాన్ దంపతుల 13 నెలల పాపను వారి ఇంటికి సమీపంలో నివాసముంటున్న మారియమ్మ, ఆమె భర్త కన్నన్ కందన్ అలియాస్ మురుగన్ ఈనెల 21వ తేదీన కిడ్నాప్ చేశారు. దీనిపై ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు నేతృత్వంలో ఈస్ట్ సీఐ శ్రీనివాసులు మూడు బృందాలు ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో ఆసక్తికరమైన విషయాలు బయట పడ్డాయన్నారు. పాపని భిక్షాటన చేసేందుకు రూ. 25 వేలకు విక్రయించారన్నారు. బాలికను తీసుకుని తమిళనాడులోని ఈ రోడ్డు రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేస్తుండగా పోలీసులు గుర్తించి, ఈనెల 23వ తేదీన సాయంత్రం తమిళనాడులోని వేలూరు జిల్లా విడదంపట్టు ప్రాంతంలో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. వారి వద్ద నుంచి బాలికను, రూ.2500 నగదు, రూ.279 చిల్లర నాణ్యాలు, పాల బుడ్డి, చిన్న టవలు, టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించే విషయంలో డీఎస్పీ భక్తవత్సలం నాయుడు, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ హేమాద్రి సిబ్బంది ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.


