హత్య కేసులో నిందితుడి అరెస్టు
రామచంద్రాపురం: మండలంలోని బలిజపల్లిలో ఉన్న ఒంటరి మహిళ మునీశ్వరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడు విశ్వనాథ్ (ప్రశాంత్)ను అరెస్టు చేసినట్లు సీఐ సురేష్ కుమార్ శనివారం మీడియాకు వెల్లడించారు. బలిజపల్లికి చెందిన మునీశ్వరి తన నివాసంలో ఒంటరిగా నివసించేవారు. ఈ నెల 11వ తేదీన ఆమె తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మృతురాలి కుమారుడు కుప్పయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎస్సై భక్తవత్సలం నేతృత్వంలోని బృందం సాంకేతిక టెక్నాలజీతో నిందితుడి కోసం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలో రాయలచెరువు సమీపంలోని చిట్టతూరు, కాళేపల్లి జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం నిందితుడు విశ్వనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఈ నెల 8వ తేదీనే తాను మునీశ్వరిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. గత ఏడాది వెంకట్రామాపురం వద్ద పొలాలు ఒంటరి మహిళ మునీశ్వరి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకోవడానికే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నిందితుడు వద్ద నుంచి రెండు బంగారు చైన్లు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. కేసు ఛేదించిన ఎస్‌ఐ భక్తవత్సలం, ఏఎస్‌ఐ ఈశ్వరయ్య ఇతర సిబ్బందిని సీఐ సురేష్ కుమార్ అభినందించారు.
హత్య కేసులో నిందితుడి అరెస్టు


