చోరీ కేసులో నిందితుడి అరెస్టు
బుచ్చినాయుడుకండ్రిగ: మండలంలోని పలు ఆలయాల్లో చోరీకి పాల్పడిన దుండగుడిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులకు ఈ వివరాలను ఆయన వెల్లడించారు. తడ మండలం చేన్నుగుంట గ్రామానికి చెందిన వేణు (22) జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నాడు. ఇంట్లో గొడవ పడి మరదవాడలోని అన్న ఇంటి వద్ద ఉండేవాడు. గురువారం ఉదయం కారణిలోని షిర్డిసాయిబాబా మందిరంలో హుండీని తీసుకుని పొలాల వద్ద పగలగొట్టుతుండగా గ్రామస్తులు పట్టుకుని, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు. నీర్పాకోట గ్రామంలోని చెంగాళమ్మ గుడి, తలారివెట్టులోని ఆలయాల్లో చోరీ చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
ఎయిర్ అలియన్స్ విమానం గంట ఆలస్యం
రేణిగుంట: హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చే ఎయిర్ అలియన్స్ విమానం గురువారం ఒక గంట ఆలస్యంగా చేరింది. మామూలుగా ఉదయం 7.10 గంటలకు వచ్చి మళ్లీ 7.50 గంటలకు తిరుగు ప్రయాణం కావాల్సి ఉండగా గురువారం ఉదయం 8.20కి చేరుకుని 8.50 గంటలకు తిరుగు ప్రయాణం అయింది. ఆలస్యానికి గల కారణాలు అధికారులు తెలపలేదు.
నాయుడుపేటలో 3 వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల స్టాపింగ్
నాయుడుపేట టౌన్: రైల్వేస్టేషన్‌లో కొత్తగా మూడు వీ రైల్వేస్టేషన్‌ల స్టాపింగ్ ఏర్పాటుకు రైల్వే ఉన్నతాధికారుల నుంచి అనుమతులు వచ్చినట్లు సదరన్ రైల్వే డీఆర్‌యూసీసీ సభ్యుడు పేర్నాటి జోసఫ్, వినియోగదారుల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం మస్తాన్ తెలిపారు. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితోపాటు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చొరవతో కొత్తగా ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్‌కు అనుమతులు వచ్చాయని వారు హర్షం వ్యక్తం చేశారు. ట్రైన్ నెంబర్ 16523/16524 ఎస్‌ఎంవీటీ బెంగళూరు టూ బలుర్‌ఘాట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం 3.18 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఆదివారం 6.18 గంటలకు నాయుడుపేటలో ఆగనుందని తెలిపారు. ట్రైన్ నెంబర్ 16223/16224 ఎస్‌ఎంవీటీ బెంగళూరు టూ రదీకపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ గురువారం 10.40 గంటలకు, తిరుగు ప్రయాణం మంగళవారం 11.40 గంటలకు నాయుడుపేట స్టాపింగ్ ఉంటుందన్నారు. అలాగే రైలు నంబర్ 20610/ 20609 ఎన్‌జే పీ తిరుచ్చి చెంగల్ పట్టాయ్ టూ న్యూ జల్పాయిగురి వీక్లీ ఎక్స్‌ప్రెస్ బుధవారం 3.58 గంటలకు, తిరుగు ప్రయాణం ఆదివారం 5.28 గంటలకు ఆగుతుందని రైల్వే అధికారులు తెలియజేసినట్లు తెలిపారు.
రేణిగుంట మీదుగా మరో రైలు
రేణిగుంట: దక్షిణ మధ్య రైల్వే నూతనంగా హైదరాబాద్ (చర్లపల్లి)– తిరువనంతపురం నార్త్ మధ్య అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం నుంచి ప్రారంభిస్తుంది. ఈ రైలు రేణిగుంట మీదుగా వెళ్లనుంది. రేణిగుంటలో తెల్లవారుజామున 3.30కి బయలుదేరి చర్లపల్లికి 4.30 సాయంత్రం చేరుకోనుంది. రాత్రి శ్రీవారి దర్శనం అనంతరం పగలు ప్రయాణం చేసేవారికి ఈ రైలు చాలా ఉపయోగపడనుంది. రైలు ప్రారంభ ప్రత్యేక స్టాప్‌లు, సమయాల వివరాలను రైల్వే శాఖ విడుదల చేసింది. ఈ స్పెషల్ ట్రైన్‌లో 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, ఒక ప్యాంట్రీ కార్, రెండు సెకండ్ క్లాస్ కోచ్‌లు (దివ్యాంగులకు అనుకూలమైనవి) ఉంటున్నాయి.


