గుడిమల్లం ఆలయ యూట్యూబ్ చానల్ ప్రారంభం
ఏర్పేడు: మండలంలోని గుడిమల్లంలో ఉన్న ప్రఖ్యాత శైవక్షేత్రమైన శ్రీఆనందవళ్లి సమేత పరశురామేశ్వర స్వామి ఆలయ అధికారిక యూట్యూబ్ చానెల్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ బటన్ నొక్కి ప్రారంభించారు. బుధవారం ఉదయం ఆయన పరశురామేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ గుడిమల్లంలోని పరశురామేశ్వరస్వామి ఆలయం భారత దేశంలోనే అతి ప్రాచీనమైన శివాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందిందని తెలిపారు. దేవాలయంలోని విగ్రహం ప్రత్యేక శైలిని కలిగి ఉందన్నారు. దేశ నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం భక్తులు ఎక్కువగా వస్తున్నారన్నారు. ఈ ఆలయం జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించపడుతుందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. ఈ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దేవాలయానికి బోర్డును ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించిందని, ఆలయ విశిష్టతను, ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్‌రెడ్డి, ఏర్పేడు జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పేరం ధనంజయులు నాయుడు, గుడిమల్లం ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, పేరం నాగరాజు నాయుడు, వేమూరి బాలాజీ నాయుడు, ఆలయ ఈఓ రామచంద్రారెడ్డి, ఏర్పేడు తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యం తదితరులు పాల్గొన్నారు.


