తుమ్మలగుంటలో ద్వాదశి వేడుకలు
తిరుపతి రూరల్: తుమ్మలగుంట ఆలయం వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులు తాకిడి తగ్గలేదు. ఆలయం వెలుపల క్యూల్లో భక్తులు నిలబడగా వీలైనంత త్వరగా దర్శనం కల్పించాలని ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి సిబ్బందికి సూచించారు. ఆయనే దగ్గరుండి ఆలయంలోపల భక్తులందరికీ దర్శనం చేయించారు. భక్తులకు అర్చన, హారతులతో పాటు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వైకుంఠ ద్వారంలో భక్తులు ఆలస్యం చేయడంతో క్యూలు ముందుకు కదలకపోవడంతో వేగంగా నడవాలని భక్తులకు వలంటీర్ల ద్వారా సూచనలు చేయించారు.
ద్వాదశి ప్రత్యేక పూజలు
ఆలయంలో కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి ద్వాదశి పూజ లు చేశారు. ఏకాదశి మరుసటి రోజున స్వామి వారికి నివేదించే దైనందిన పూజా కార్యక్రమాలను యథావిధిగా పూర్తి చేశా రు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అభిషే కం చేసి, భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే చక్రతాళ్వార్‌కు అభిషేకం చేసి భక్తులకు ఆ నీటిని తీర్థంగా పంపిణీ చేశారు.
వైకుంఠ ద్వారంలో పలువురు ప్రముఖులు
తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఏర్పాటు చేసిన వైకుంఠ ద్వారంలో పలువురు ప్రముఖులు ప్రవేశించారు. వైఎస్సార్ సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి కుటుంబ సమేతంగా తన అనుచరులతో కలసి స్వామివారిని దర్శించారు. ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వారికి సాదర స్వాగతం పలికి దర్శనం చేయించారు. అలాగే పలువురు రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు సైతం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.
నేడు భక్తులకు అందుబాటులో వైకుంఠ ద్వారం
నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచనున్నట్టు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తెలిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
తుమ్మలగుంటలో ద్వాదశి వేడుకలు


