కర్షకుడికి కన్నీటి కష్టాలు
సుదూర ప్రాంతాల్లో నారు మడులను కొనుగోలు చేసి తరలిస్తున్న రైతులు(ఇన్‌సెట్) వాకాడు వద్ద
పాచిపోయిన వరి పంట
ఇటీవల వచ్చిన దిత్వా తుపాన్ ప్రభావంతో సంభవించిన వరదలకు నష్టపోయిన వరి రైతులు నేటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. తుపాన్‌కు ముందు వరి నాట్లు వేసుకున్న రైతులను వరదలు ముంచేశాయి. మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో దాదాపు 1,550 ఎకరాల్లో వరినాట్లు వరద నీటిలో మునిగి పాచిపోయాయి. 30 రోజుల తరువాత వరదలు తగ్గడంతో మళ్లీ రెండోసారి రైతులు దుక్కి సిద్ధం చేసి సుదూర ప్రాంతాల నుంచి నార్లు అధిక ధరలకు కొనుగోలు చేసి నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతులు ఎకరాకు దాదాపు రూ. 20 వేలు వరకు పెట్టుబడులు పెట్టి నష్టపోయిన రైతులకు ఇది గోరుచుట్టుపై రోకటి పోటు చందంగా మారింది. పంట కోత దశకు వచ్చేదాకా ఎంత పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందోనని రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇంత కష్టపడి పండించిన ధాన్యానికి అమ్ముకునే సమయంలో కనీస మద్దతు ధర లభిస్తుందా? లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద నష్టాలతో సతమవుతున్న రైతులకు ప్రభుత్వం కంటితుడుపుగా 80 శాతం రాయితీతో ఎకరాకు ఒక బస్తా విత్తనాలు అందజేయడంపై రైతులు కనెర్ర చేస్తున్నారు.
– వాకాడు
కర్షకుడికి కన్నీటి కష్టాలు


