తుమ్మలగుంట వెంకన్న వైకుంఠ ఏకాదశికి ముస్తాబు
తిరుపతి రూరల్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంట కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఆలయం లోపల, బయట చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లను ఆలయ వ్యవస్థాపకుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే గర్భాలయంను శుద్ధి చేసిన అర్చకస్వాములు ఆయలంలోని పరివార దేవతామూర్తుల ఆలయాలను పరిశుభ్రం చేశారు. అలాగే అలంకార మండపంలోని స్వామి వారి వాహనాలు, ఆలయ పుష్కరణిని సుంగభరిత ద్రవ్యాలతో శుభ్రం చేశారు. ఆలయం ముందు ప్రత్యేకంగా ఇనుప బ్యారికేడ్లతో క్యూలు, చలువ పందిళ్లు ఏర్పాటు చేసి, రంగ వల్లులతో తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరిస్తున్నారు. ప్రధాన ఆలయంతో పాటు ధ్వజస్తంభం, పరివార దేవతామూర్తుల ఆలయాలకు జరిగే పుష్పాలంకరణకు దేశ, విదేశాల నుంచి పుష్పాలను తీసుకువస్తున్నారు.
వైకుంఠ ద్వారాన్ని సిద్ధం చేస్తున్న కార్మికులు
కల్యాణ వేంకటేశ్వరస్వామి గర్భాలయం చుట్టూ ఉన్న వైకుంఠ ద్వారాన్ని అందంగా పుష్పాలంకరణతో సిద్ధం చేస్తున్నారు. శంకు, చక్ర నామాలతో కూడా వైకుంఠ ద్వారం నుంచి భక్తులు ప్రవేశించగానే భక్తితో మైమరిపించేలా గోవింద నామ సంకీర్తలతో పాటు సుగంధాలను వెదజల్లే పరిమళ భరిత పుష్పాలు, పత్రాలను అమర్చడానికి వీలుగా ప్‌లైవుడ్ ఏర్పాటు పనులు చేపట్టారు. వైకుంఠ ద్వారంలో అందమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు.
అర్ధరాత్రి ధనుర్మాస కై ంకర్యాలు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 29వతేదీ అర్ధరాత్రి దాటిన తరువాత స్వామి వారికి ధనుర్మాస కై ంకర్యాలు, తోమాలసేవ, కొలువు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆ తరువాత తెల్లవారు జామున 4 గంటలకు వైకుంఠ ద్వారానికి ప్రత్యేక పూజలు చేసి, ప్రారంభిస్తారు. అనంతరం వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తారు.
కనువిందు చేయనున్న దశావతారాలు
తుమ్మలగుంట గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిన దశావతారాల విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎలక్ట్రికల్ పనులు ప్రారంభం కావడంతో రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్ వెలుగులు మధ్యన దేవదేవుని దశావతారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి.
తుమ్మలగుంట వెంకన్న వైకుంఠ ఏకాదశికి ముస్తాబు


