తూర్పు కనుమలపై ప్రత్యేక పరిశోధన
ఏర్పేడు:జీవ వైవిధ్యం, విభిన్న వాతావరణ పరిస్థితులకు కారణమవుతున్న తూర్పు కనుమలకు గుర్తింపును తీసుకొస్తూ ప్రత్యేక పరిశోధన, పరిరక్షణపై మంగళవారం ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలోని తిరుపతి ఐసర్‌లో ప్రత్యేక సెమినార్‌ను నిర్వహించారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న తూర్పు కనుమల్లోని ప్రత్యేక భూగోళిక పరిస్థితులు, జీవరాశుల ఉనికి తదితర అంశాలపై విస్తృత పరిశోధనలు జరగాలని సెమినార్‌లో శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇండియా నేచురల్ డెవలప్‌మెంట్ అధికారి ఫరీదాటంపాల్ పడమటి కనుమలకు గుర్తింపు ఉన్నట్లే తూర్పు కనుమలకు గుర్తింపు వచ్చేలా చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సెమినార్‌లో ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శంతాను భట్టాచార్య, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కేఎన్ సత్యనారాయణ, అటవీశాఖ తిరుపతి సీసీఎఫ్ సెల్వం, తిరుపతి డివిజనల్ ఫారెస్ట్ అధికారి సాయి బాబా, స్టేట్ సెరికల్చరిస్ట్ బబితా, రాజమండ్రి సెరికల్చరిస్ట్ అధికారి శ్రీనివాసరావు, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పారావు, కాకినాడ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు, విశాఖపట్నం సబ్ డివిజనల్ ఫారెస్ట్ అధికారి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీ జూపార్క్ జంతు జాలాల
నమూనాలు ప్రదర్శన
తూర్పు కనుమలపై పరిశోధనల కోసం తిరుపతి ఐసర్‌లో చేపట్టిన సెమినార్ సందర్భంగా తిరుపతి ఎస్వీ జూ పార్క్ ఆధ్వర్యంలో వివిధ జంతుజాలాల నమూనాలను ప్రదర్శించారు.
శ్రీశైలం ఫారెస్ట్ స్టాల్ ప్రదర్శన
ఐసర్ విద్యాసంస్థలోని విద్యార్థుల పరిశోధనకు అవగాహన కోసం అడవుల సంరక్షణ, పులుల పరిరక్షణ, పర్యావరణంలో అడవుల పాత్రపై ఈస్ట్రన్ గాడ్స్ పరిరక్షణ కార్యక్రమం కింద అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ జి. విఘ్నేష్ అప్పారావు మాట్లాడుతూ శ్రీశైలం టైగర్ రిజర్వ్ సైన్స్ పరిశోధన విద్యార్థులకు పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణ, వాతావరణంలో మార్పులకు అడవులు ఎలా దోహదపడతాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టైగర్ ఫారెస్ట్ శ్రీశైలం ఫారెస్ట్‌లో 87 పులులున్నాయని, వీటి సంఖ్య పెంచుతామన్నారు.
తూర్పు కనుమలపై ప్రత్యేక పరిశోధన
తూర్పు కనుమలపై ప్రత్యేక పరిశోధన


