కాటన్‌మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
– ఎంపీ గురుమూర్తి
తిరుపతి మంగళం : తిరుపతి కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో మంగళవారం కాటన్ మిల్లు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఎంపీ గురుమూర్తిని కలిసి సమస్యలను వివరించారు. మిల్లు మూతపడిన తర్వాత తమకు రావాల్సిన జీతాలు, పీఎఫ్, గ్రాట్యూటీ వంటి బకాయిలు ఇంకా చెల్లించకపోవడం వలన తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. 1997 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ఇప్పటి వరకు గ్రాట్యూటీ చెల్లించలేదని, 110 మంది శాశ్వత ఉద్యోగులకు గత 10 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఎంపీకి వివరించారు. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పూర్తి గ్రాట్యూటీ ఇవ్వలేదని, వారికి కేటాయించిన క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కరించకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. ఈ సమస్యను మరోసారి పార్లమెంట్ వేదికగా బలంగా వినిపించి, ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎంపీ గురుమూర్తి వారికి హామీ ఇచ్చారు.


