
కండలేరుపైనే ఆశలు
సైదాపురం : నెల్లూరు, తిరుపతి జిల్లాలకు వరప్రదాయినిగా ఉన్న కండలేరు జలాశయంలోకి రోజురోజుకూ నీటి మట్టం పెరుగుతుండడంతో అన్నదాతల ఆశలన్నీ కండలేరు జలాశయంపైనే ఉన్నాయి. ప్రధానంగా నాన్ డెల్టా రైతుల ఆశలు మరింత చిగురిస్తున్నాయి. కండలేరు జలాశయంలో ఇప్పటికే 30 టీఎంసీల నీటి నిల్వలు ఉండడంతో ఈ సీజన్ సాగుకు డోకా లేదని రైతులు భావిస్తున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాలోని కొన్ని మండలాలకు కండలేరు జలాశయం ద్వారా సాగు నీరును కూడా విడుదల చేశారు.
పెరుగుతున్న వరద
ప్రధానంగా కండలేరు జలాశయంలో నేడు 30 టీఎంసీలు చేరాయి.దీనికి తోడు ప్రతి రోజు సోమశిల జలాశయం నుంచి 9400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సెప్టెంబర్ నెలాఖరుకు 50 టీఎంసీలు నీరు చేరు అవకాశం ఉందని అధికారులతో పాటు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కండలేరు జలాశయంలో పుష్కలంగా నీరు ఉండటంతో ఆయకట్టు రైతులకు రబీపై మరింత భరోసా కలిగింది.
ఆగస్టులో డెడ్‌స్టోరేజ్..
గత ఆగస్టు నెలలో కండలేరు డెడ్ స్టోరేజీకి చేరుకుంది.సోమశిల జలాశయం నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం 30 టీఎంసీలు జలాశయంలో నీరు నిల్వ ఉంది. ప్రధానంగా సర్వేపల్లి, వెంకటగిరి, శ్రీకాళహస్తి , సత్యవేడు, గూడూరు నియోజకవర్గాలకు చెందిన రైతులకు కండలేరు జలాశయం నుంచి వచ్చే నీటిని ఆధారం చేసుకుని రబీ పంటల సాగువుతున్నాయి.
చెరువులకు సాగునీరు
కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1600 క్యూసెక్కులు, పిన్నేరు కాలువకు 30 క్యూసెక్కులు ,లోలెవల్ కాలువకు 20 క్యూసెక్కులు ,మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కులు వంతున నీరు విడుదల చేస్తున్నారు. దీంతో కండలేరు నుంచి చెరువులకు సాగునీరు అందే అవకాశం ఉంది.
అవసరం ఇలా...
కండలేరు జలాశయం పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు ద్వారా నెల్లూరు, తిరుపతి జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్‌లో సాగునీటి అవసరాలకు విడతల వారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా
రబీ సీజన్‌కు రైతుల ఆశలు తీరనున్నాయ్. నాన్‌డెల్టా ప్రాంత రైతులు రబీ సీజన్‌లో పంటలు పండించుకునే అవకాశం ఏర్పడింది. అధికారులు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. – రాంగోపాల్‌రెడ్డి, గులించెర్ల,
సైదాపురం మండలం
కై వల్యానదికి గంగనీరు
ఈ ఏడాది సాగు నీటి కోసం పడరాని పాట్లు పడ్డాం. కాని ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో కండలేరు జలాశయానికి 30 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. దీంతో కండలేరు నుంచి కై వల్యానదికి నీరును విడుదల చేయడంతో ఈ ప్రాంత రైతులకు సాగునీరు ఇబ్బందులు లేకుండా ఉన్నాయి.
– శివకుమార్ ,సైదాపురం

కండలేరుపైనే ఆశలు

కండలేరుపైనే ఆశలు