
పెరోల్ ఘటనలో ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి
పెళ్లకూరు : జీవిత ఖైదీ శ్రీకాంత్‌కు గూడూరు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు పాశం సునీల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పెరోల్‌కు రెకమండ్ చేస్తూ లెటర్ ఇవ్వడం దుర్మార్గమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు రెకమండ్ చేసిన లేఖపై హోంమంత్రి అనిత సంతకం చేయడం దారుణమని విమర్శించారు. పెరోల్ లెటర్‌ను జైలుశాఖ అధికారులు గతనెల 16న తిరస్కరించినప్పటికీ ఎమ్మెల్యేలు, మంత్రి కలిసి పట్టు వదలకుండా జీవితఖైదీకి వంద రోజులు పెరోల్ ఇప్పించడం టీడీపీ పాలనా విధానానికి తార్కాణం అన్నారు. జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పించడం వెనుక ఉన్న రహస్యాన్ని రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత హోం మంత్రికి ఉందన్నారు. ఈ విషయంపై ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై హోంమంత్రి అనుచరులు దాడులకు పాల్పడడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రి ఈ విషయంలో స్పందించి హోంమంత్రి, ఎమ్మెల్యేలకు ఏ స్థాయిలో ముడుపులు అందాయో నిగ్గు తేల్చాలన్నారు. తక్షణమే ఎమ్మెల్యేలపై వేటు వేసి హోం మంత్రి పదవికి రాజీనామా చేయించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.