
సాక్షి, తిరుపతి: తిరుపతిలో బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ..‘తిరుపతిలో భూ భాగోతానికి తెరతీశారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఆలయానికి సంబంధించిన భూమి టూరిజానికి ఇవ్వడం నేరం. ఆలయ భూములను టూరిజానికి కట్టబెట్టడంపై మేము అభ్యంతరం తెలిపాం. అత్యంత విలువైన భూమి అన్యాక్రాంతం అవుతోంది. దేవుడి భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా?.
టీటీడీ ల్యాండ్‌ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారు?. బీఆర్ నాయుడు, చంద్రబాబు సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దేవుడి భూమిని వాణిజ్య పరంగా మార్పిడి చేస్తున్నారు. ఇది పూర్తిగా ధర్మం మీద దాడి. వాణిజ్య అవసరాలకు దేవుడి భూమిని వాడుకుంటారా?. అత్యంత పవిత్రమైన టీటీడీ ల్యాండ్ టూరిజానికి ఇవ్వడమేంటి?. మరెక్కడో ఉన్న ప్రభుత్వ భూమిని ఇవొచ్చు కదా?. టీటీడీ బోర్డు మీటింగ్‌లో మా అభ్యంతరాలను తిరస్కరించారు.

మే నెల ఏడో తేదీన జరిగిన బోర్డు మీటింగ్‌లో ఆగ మేఘాలపై సమావేశం నిర్వహించారు. అలిపిరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో టూరిజం భూమి తీసుకుని టూరిజంకు బదలాయించారు. 05.08.25 క్యాబినెట్ సమావేశంలో దీనికి ఆమోదంతో 07.08.25 జీవో ఇచ్చారు. అత్యంత విలువైన స్థలం ఇవ్వడంపై నేను కూడా అభ్యంతరం వ్యక్తం చేశాను. అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఆసుపత్రి మధ్య ప్రాంతం 20 ఎకరాలు 1500 కోట్ల విలువైన స్థలం ఇచ్చారు. ఆ విలువైన 20 ఎకరాలు ఒబెరాయ్ హోటల్ కు ఇవ్వాలని చూస్తున్నారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలంలో రెవెన్యూ భూమి ఇవ్వొచ్చు కదా. మంత్రి రాసలీలలు గురించి మాట్లాడిన టీడీపీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పారు. నేను ఏ ఒక్క విషయం వక్రీకరించలేదు. టీడీపీ నేత సుధాకర్ రెడ్డిపై ఒత్తిడి పెంచినట్లు ఉంది అని వ్యాఖ్యలు చేశారు.