
సాక్షి, తిరుపతి: తిరుమలను కూటమి నేతలు రాజకీయ స్వార్థాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైఎస్సార్‌సీపీ హయాంలోనే రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నామని తెలిపారు. తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సయమంలో పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను అని సవాల్ విసిరారు. అలాగే, జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు అంటూ ఎద్దేవా చేశారు.
టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్సార్‌సీపీ హయాంలో రవి కుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నాం. మా పాలనలోనే రవి కుమార్ దొంగతనం బయటపెట్టాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రవి కుమార్ చోరీ చేశాడు. రవి కుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులు టీటీడీకి ఇచ్చారు. రవి కుమార్ అనే దొంగను చంద్రబాబు ప్రభుత్వం పట్టుకుందా?. కొట్టేయాలని అనుకున్న వారు దొంగను పట్టుకుంటారా?. దమ్ముంటే, ధైర్యముంటే విజిలెన్స్ నివేదిక బయట పెట్టాలి. రవి కుమార్‌కు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్నాయి. మా బినామీలకు ఆస్తులు రాసి ఇచ్చి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలి. మంత్రి ఆనం సమాధానం ఇచ్చాక కూడా ఆ నివేదిక ఎందుకు బయటకు రాదు?. ఆ నివేదికకు సంబంధించి చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది.
జ్ఞాన శూన్య మూర్ఖేష్ లోకేష్. భక్తిలేని రస రాయుడు బీఆర్ నాయుడు. నేను ఉన్నప్పుడు పరకామణి ఘటన జరిగిందని రుజువైతే నా తల నరుక్కుంటాను. దమ్ముంటే సీబీఐ చేత విచారణ చేయించండి. నిజాలు నిగ్గు తేలాలి అంటే సీబీఐ చేత విచారణ చేయించాలి. సీబీఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం. పరకామణిలో ఏం జరుగుతుందో సీసీ ఫుటేజీ ద్వారా బయటపెట్టాలి. కూటమికి తాబేదార్లుగా ఉన్న అధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావు. చంద్రబాబు హయాంలో కొట్టేసిన స్వామి వారి నిధులను మేం ఆ దేవదేవుడికి రాయించాం. కోడిగుడ్డు మీద ఈకలు పీకడాన్ని కూటమి ప్రభుత్వం మానుకోవాలి. బీఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి అడుగడుగునా తప్పులే జరుగుతున్నాయి.
చంద్రబాబు పాలనలో జరిగిన సీసీ కెమెరాలు పుటేజ్ బయట పెట్టాలి. లడ్డు విషయంలో జరిగిన తరహాలో సీబీఐ విచారణ జరిపించాలి. వందల కోట్లు మేము అవినీతికి పాల్పడ్డామని మాపై నిందలు వేశారు. శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేస్తాము అని చెప్పిన బీఆర్ నాయుడు ఇది చాలా మంచి స్కీమ్ అని మెచ్చుకున్నారు. 22-07-2025 రోజున శ్రీవాణి టికెట్ల ధరను రూ.2వేలకు పెంచడానికి తీర్మానం చేశారు. భగవంతుడిని అడ్డు పెట్టుకుని వ్యాపారం, రాజకీయాలు చేస్తున్నారు. పరకామణిలో ఏం జరుగుతుందో నిరంతరం చూపించాలి. వీఐపీ దర్శనాలు తగ్గిస్తున్నామని చెప్పి, ఇంకా పెంచుతూ పోయారు’ అని ఘాటు విమర్శలు చేశారు.