ప్రైవేటు సేవలో సూపర్‌ స్పెషలిస్టులు | Super specialists in private service | Sakshi
Sakshi News home page

ప్రైవేటు సేవలో సూపర్‌ స్పెషలిస్టులు

Dec 22 2025 5:18 AM | Updated on Dec 22 2025 5:18 AM

Super specialists in private service

జీజీహెచ్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య విభాగాలకు తాళాలు

జీజీహెచ్‌లో జీతాలు తీసుకుంటూ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు

సూపర్‌ స్పెషాలిటీ సేవల కోసం వచ్చే పేద రోగులకు తప్పని తిప్పలు ...    

పట్టించుకోని ఆసుపత్రి అధికారులు...

గుంటూరు మెడికల్‌ :  సాధారణ వైద్య సేవలు సైతం ఖరీదైపోతున్న నేటి రోజుల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు పొందాలంటే పేద రోగులు రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తుంది. గుండె, కిడ్నీ, క్యాన్సర్‌ వంటి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలకు గుంటూరు జీజీహెచ్‌ పేదలకు పెద్ద దిక్కుగా ఉంది. 

ఉమ్మడి గుంటూరు జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల కంటే మెరుగైన, అధిక సంఖ్యలో సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే వైద్య విభాగాలు కలిగి ఉన్న గుంటూరు జీజీహెచ్‌లో సూపర్‌ స్పెషలిస్టుల సేవలు అంతంత మాత్రంగానే లభిస్తున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు గుంటూరు జీజీహెచ్‌లో జీతాలు తీసుకుంటూ ఎక్కువ సమయం ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.   

పాటించని సమయవేళలు  
»  గుంటూరు జీజీహెచ్‌లో న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజి, సర్జికల్‌ అంకాలజీ, మెడికల్‌ అంకాలజీ సూపర్‌ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఉన్నాయి.  
» గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌లో  సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవల కోసం పలు జిల్లాలకు చెందిన పేద రోగులు ప్రతిరోజూ వేలల్లోనే వస్తున్నారు. అయితే సూపర్‌ స్పెషలిస్టుల ఓపీ సమయాలు చాలా తక్కువ సమయం ఉంటున్నాయి. ప్రతిరోజూ  వైద్య సేవలు లభించడం లేదు.  
» వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఓపీ విభాగాల్లో అందిస్తున్నారు. ఓపీ పనివేళలు సైతం చాలా తక్కువ మొత్తంలోనే ఉంటున్నాయి. చెప్పుకోవడానికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ బోర్డులపై పనివేళలు రాసి ఉంచుతారు. నిర్ణీత పనివేళల్లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.  

మధ్యాహ్నం వైద్యం నిల్‌  
» సూపర్‌స్పెషాలిటీ వైద్యులు జీజీహెచ్‌ ఇతర వైద్యుల సమయ పాలన మాదిరిగా మధ్యాహ్నం ఓపీలు నిర్వహించడం లేదు.  
   వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంది. ఉదయం ఓపీల అనంతరం మధ్యాహ్నం భోజన సమయం అనంతరం తప్పనిసరిగా మధ్యాహ్నం ఓపీలు నిర్వహించాల్సి ఉంటుంది. 
» స్పెషాలిటీ వైద్యులు కొందరు మధ్యాహ్నం భోజనం అనంతరం నాలుగు గంటల వరకు ఓపీలు నిర్వహిస్తున్నారు. కాని, సూపర్‌స్పెషాలిటీ వైద్యులు ఒక్కరు కూడా మధ్యాహ్నం ఓపీలు నిర్వహించడం లేదు.  
» ఒక పక్క జీజీహెచ్‌లో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో ఉండక, మరోపక్క ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు  చెల్లించే స్థోమత లేక పేద, మధ్యతరగతి ప్రజలు రోగాలతో కాలం గడిపేస్తున్నారు.  
» ఆసుపత్రి అధికారులు సైతం సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల పనితీరును పర్యవేక్షించకుండా మిన్నకుండిపోవడం విమర్శలకు తావిస్తోంది. 
» జీజీహెచ్‌ అధికారులు ఇప్పటికైనా సూపర్‌స్పెషాలిటీ వైద్యుల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించి, పేద రోగులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు.  

విభాగాధిపతులే అందుబాటులో ఉండటం లేదు
»  సూపర్‌ స్పెషాలిటీ వైద్య విభాగాధిపతులు పలువురు సొంత ప్రాక్టీస్‌లో బిజీగా ఉండి జీజీహెచ్‌లో నిర్ణీత వేళల్లో అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు న్నాయి.  
»  కొన్ని వైద్య విభాగాధిపతులు సొంతంగా ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. కొంత మంది వైద్య విభాగాధిపతులు స్థానికంగా నివాసం ఉండకుండా వారంలో కొద్దిరోజులు జీజీహెచ్‌లో ఉండి, మరికొద్ది రోజులు సొంత ఊర్లకు చెక్కేస్తున్నారు. 
» వైద్య విభాగాధిపతుల పర్యవేక్షణ లేకపోవడం, కొంత మంది వైద్య విభాగాధిపతులే ఓపీల్లో     నిర్ణీత వేళల్లో ఉండకపోవడంతో కింది స్థాయి సిబ్బంది తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు.  
»  కొంత మంది అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సైతం సొంత ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ సమయం గడిపేస్తూ జీజీహెచ్‌కు వచ్చే పేద రోగులకు స్పెషాలిటీ వైద్య సేవల కోసం చుక్కలు చూపిస్తున్నారు.  
» అధిక శాతం మంది పీజీ వైద్యులపైనే ఓపీలు నడిపించేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, పొరుగు జిల్లాల నుంచి సూపర్‌ స్పెషలిస్టుల వైద్య సేవల కోసం వచ్చే పేద రోగులకు అడ్మిషన్‌ దొరకాలంటే వారాల కొద్ది సమయం పడుతోంది.  
» అడ్మిషన్‌ అయిన తరువాత నుంచి చికిత్స పొందేందుకు మరికొంత సమయం పడుతోంది. ఇలా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవల కోసం వస్తున్న పేద రోగులకు సకాలంలో సత్వర వైద్యం అందడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement