సాక్షి, అమరావతి: విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాచవరం పీఎస్ పరిధిలో డ్రగ్స్ సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు అర్థరాత్రి అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను నుంచి ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరుకు చెందిన మరో నిందితుడు అనూహ్యంగా పోలీసుల అదుపులో నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
విజయవాడలోని ఓ హోటల్‌లో నిందితులు ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరి నుంచి మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి వారు ఉపయోగించిన కారుతో సహా స్టేషన్‌కు తరలించారు. అయితే కారు పార్కు చేసి రావాలని నిందితుడికే తాళాలు అప్పగించడంతో అతడు పరారైనట్లు తెలుస్తోంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయవాడలోని మధురానగర్, సింగ్‌నగర్‌కు చెందిన నిందితులిద్దరూ ఇంటర్ తర్వాత చదువు మానేసి చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. స్నేహితుల పార్టీల్లో వీళ్లకు ఎండీఎంఏ అలవాటైంది. అలా తరచూ బెంగళూరు వెళ్లి అక్కడ కొని విజయవాడ తెచ్చి స్నేహితులతో కలిసి తీసుకునేవారు. ఈనెల 19న కారులో వీరిద్దరూ బెంగళూరుకు బయలుదేరారు. 20న అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి వద్దకు వెళ్లి రూ.36వేలు చెల్లించి 19 గ్రాముల డ్రగ్స్ కొనుగోలు చేశారు.
వీరు బెంగళూరు వెళ్లిన విషయాన్ని నిందితుల్లో ఒకడి స్నేహితుడి ద్వారా నెల్లూరుకు చెందిన మరో యువకుడు తెలుసుకున్నాడు. వెంటనే ఫోన్ చేసి తనకు తెలిసిన వ్యక్తి నుంచి 2 గ్రాముల ఎండీఎంఏ తీసుకురావాలని కోరాడు. అయితే.. అప్పటికే బెంగళూరులో ఉన్న నిందితుల్లో ఒకడు పోలీసుల నిఘా ఉందని చెప్పాడు. తర్వాత బతిమిలాడి ఒప్పించి డబ్బులు పంపించాడు.
బెంగళూరు నుంచి రెండు గ్రాములు తీసుకుని కారులో బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో నెల్లూరులో దిగి ఎండీఎంఏ ఇచ్చారు. అక్కడవారు కొంత డ్రగ్స్ తీసుకున్నారు. అయితే.. కారు మొరాయించడంతో అక్కడే వదిలేసి, నెల్లూరుకు చెందిన నిందితుడి కారులో ముగ్గురూ విజయవాడ చేరుకుని మాచవరం స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో దిగారు. అక్కడ ముగ్గురూ డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలారు.
టాస్క్‌ఫోర్స్ పోలీసులు హోటల్‌పై దాడి చేసి, వీరిని పట్టుకుని 10 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఎండీఎంఏ అమ్మిన ఇద్దరి కోసం మరో బృందం బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. నగరంలో ఈ మధ్యకాలంలో ఇలాంటి వ్యవహారాలు తరచూ వెలుగు చూస్తుండడం గమనార్హం. అయినా కూడా మాదకద్రవ్యాలు కట్టడి చేయలేకపోతున్నారంటూ పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


