
వీధి రౌడీలా ప్రవర్తించిన సర్వేయర్‌ను సస్పెండ్ చేయాలి
చిట్టమూరు : తాను ప్రభుత్వ అధికారి అని మరిచి మండల సర్వేయర్ వీధి రౌడీలా వ్యవహరించాడని చిట్టమూరు మండలంలోని కోగిలి పంచాయతీ సోమసముద్రం గ్రామస్తులు శనివారం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. గ్రామస్తుల వివరాల మేరకు.. సోమసముద్రం గ్రామంలో దళితులు, బీసీలకు గతంలో ప్రభుత్వం కొంత స్థలాన్ని శ్మశానానికి కేటాయించారని పేర్కొన్నారు. అయితే చిట్టమూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేతకు ఒక ఎకరా పొలం శ్మశానం పక్కనే ఉండేదన్నారు. అయితే అధికార పార్టీ నేత తనకున్న ఎకరా పొలంతో కలిపి 5 ఎకరాలు పట్టా చేయించుకున్నాడని ఆరోపించారు. ఆ భూమిని సర్వే చేసి అధికార పార్టీకి చెందిన నేతకు అప్పగించాలని మండలస్థాయి అధికార పార్టీ నేత ఒకరు హుకుం జారీ చేయడంతో తహసీల్దార్‌తో కలసి సర్వేయర్ సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుసుకుని సోమసముద్రం గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ నేత అండ దండలతో సర్వేయర్ రెచ్చిపోయి వీధి రౌడీలా గ్రామస్తులపై తిరగబడి మహిళలు అని కూడా చూడకుండా బూతులు తిడుతూ వీరంగం చేశాడన్నారు. సదరు సర్వేయర్ అధికార పార్టీ గల్లీ నేత నుంచి ముడుపులు తీసుకుని గ్రామస్తులకు కనీస సమాచారం ఇవ్వకుండా తన ఇష్టానుసారం ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నేతకు అప్పనంగా కట్టబెట్టేందుకు పూనుకోవడం దారుణమన్నారు. దీంతో గ్రామస్తులు తమ గ్రామం నుంచి శనివారం భారీ ర్యాలీగా బయలుదేరి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. వెంటనే సర్వేయర్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యాలయానికి వచ్చిన తహసీల్దార్‌ను అడ్డుకుని తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సతీష్ కుమార్ గ్రామస్తులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. తమకు న్యాయం చేయక పోతే ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.