
పింఛన్ల తొలగింపుపై కలెక్టరేట్ వద్ద ధర్నా
చంద్రగిరి : కూటమి ప్రభుత్వం సదరం రీ అసైన్మెంట్ పేరుతో అర్హులైన దివ్యాంగుల పింఛన్ల ఏరివేత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వికలాంగుల జేఏసీ నేతలు తెలిపారు. ఈ మేరకు ధర్నాకు అనుమతి కోరుతూ బుధవారం తిరుచానూరు సీఐ సునీల్ కుమార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.
గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి కలెక్టరేట్ ఎదుట జిల్లా వికలాంగుల ఐకాస (జేఏసీ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అర్హులైన పింఛనుదారులను తొలగించడం దారుణమన్నారు. వచ్చే నెల నుంచి పింఛన్లను నిలిపివేస్తున్నట్లుగా ఇప్పటికే అర్హులకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
శ్రీవారి సేవలో రైల్వే జీఎం
తిరుమల: రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితుల వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 30 కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ సేవా సదన్ వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 76,033 మంది స్వామిని దర్శించుకున్నారు. 26,905 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.5.30 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనమవుతోంది.

శ్రీవారి సేవలో రైల్వే జీఎం