
- రాసలీలల మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి..
- పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెడుతున్న మంత్రి
- హైదరాబాద్‌లోని ఖరీదైన హోటళ్ళలో నికృష్టపు చర్యలు
- చంద్రబాబు ప్రభుత్వంలో గాడి తప్పిన పాలన
- టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి
తిరుపతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రివర్యులు చేస్తున్న చీకటి బాగోతాలపై తెలుగదేశం అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి బయటపెట్టిన సంచలన నిజాలపై సీఎం స్పందించాలని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
తిరుపతిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పదవులు ఇప్పిస్తానంటూ మహిళలను ప్రలోభపెట్టి, హైదరాబాద్ లోని ఖరీదైన హోటళ్ళలో వారితో రాసలీలలకు పాల్పడుతున్న సదరు మంత్రిపై చిత్తశుద్ది ఉంటే చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన మంత్రులే ఇలాంటి నికృష్టపు చేష్టలకు పాల్పడుతుంటే, వారిపై చర్య తీసుకునేందుకు చంద్రబాబు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ చానెల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్ రెడ్డి సంచలన విషయాలను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వంలోని ఒక మంత్రి రాసలీలల గురించి మాట్లాడారు. పెద్దపెద్ద హోటళ్ళలో బస చేసే సదరు మంత్రి, తన పక్క రూంలను బుక్ చేసుకుంటూ, ఆ గదుల్లో మద్యం సేవించి, మహిళలతో రాసలీలలు సాగిస్తున్నారని సంచలన విషయాలను వెల్లడించారు. ఇప్పటికే ఈ అంశాలపై తెలుగుదేశం, జనసేన పార్టీల్లో అంతర్గతంగా చర్చ జరుగుతున్న అంశంను సుధాకర్ రెడ్డి బహిరంగ పరిచారు.
ఎమ్మెల్యేలు చేసే పొరపాట్లను సరిచేయాలంటూ మంత్రులకు ఒకవైపు సీఎం చంద్రబాబు చెబుతుంటే, మరోవైపు ఆయన సహచర మంత్రులే హైదరాబాద్‌లో రాసలీలలకు పాల్పడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి వంతపాడే ఒక పత్రికలోనే దీనిపై పెద్ద ఎత్తున కథనం కూడా ప్రచురితం అయ్యింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి తిరుపతికి తరచుగా వస్తుంటారు. వచ్చిన ప్రతిసారీ వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడం, నైతిక అంశాలను మాట్లాడి వెడుతుంటాడు.
అలాంటి మంత్రి గురించే టీడీపీ అధికార ప్రతినిధి ఎన్‌బీ సుధాకర్ రెడ్డి మాట్లాడారు. తిరుపతిలో అత్యంత ప్రముఖమైన పోస్ట్ ఇప్పిస్తానని, తనను నమ్ముకుంటే కీలకమైన పదవులు ఇప్పిస్తామంటూ మహిళలను నమ్మించి మోసం చేస్తున్నాడని కూడా ఆయనపై ఆరోపణలు చేశారు. ఆయన టీడీపీ, జనసేనకు చెందిన వారందరికీ తెలుసునని ఎన్బీ సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా ఇటువంటి అరాచకానికి సదరు మంత్రివర్యులు ఒడిగట్టడం దారుణం. అదే మంత్రి తిరుపతి పవిత్రతను కాపాడతానంటూ మాట్లాడుతుంటారు. అటువంటి మచ్చపడిన మంత్రివర్యులపైన సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.