
దివ్యాంగుల పింఛన్ల తొలగింపు దారుణం
● నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా ● న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ● దివ్యాంగుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్
తిరుపతి అర్బన్: దివ్యాంగుల పింఛన్ల తొలగింపు దారుణమని దివ్యాంగుల జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఏ పనీ చేయలేక పింఛనుపైనే ఆధారపడి జీవిస్తున్న వారిపై కూటమి ప్రభుత్వం కన్నెర్ర చేయడం దారుణమన్నారు. ప్రతి జిల్లాలోనూ 7 వేల నుంచి 10 వేల మంది పింఛన్లు తొలగించారని ఆవేదన చెందారు. ఏ రాష్ట్రంలోనూ దివ్యాంగుల పింఛన్లను ఈ స్థాయిలో తొలగించలేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన చెందారు. దివ్యాంగులు శారీరక, మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారని, అలాంటి వారి పింఛన్లను తొలగించడం నీచమైన చర్యగా పేర్కొన్నారు. పింఛన్లు ఇవ్వకుంటే వారి జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. ఆ గోడు కూటమి సర్కార్‌కు తగులుతుందని గుర్తుచేశారు. రీవెరిఫికేషన్ పేరుతో ప్రభుత్వం ఇలా దివ్యాంగులను టార్గెట్ చేయడం దురదృష్టకరంగా భావించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ క్రమంలో జిల్లా దివ్యాంగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30 గంటలకు తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు తెలిపారు. తొలగించిన అన్ని పింఛన్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.