
వైద్యులు కాదన్నారు..
● 108 సిబ్బంది ప్రాణం పోశారు
తొట్టంబేడు : శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు వైద్యం చేయలేమని చేతులెత్తేశారు. అయితే 108 సిబ్బంది చిన్నారికి ప్రాణం పోశారు. వివరాలు ఇలా.. మంగళవారం రాత్రి పెళ్లకూరు మండలం అర్ధమాల గ్రామం నుంచి వెంకటరమణమ్మ ప్రసవ నొప్పులతో బాధపడుతుండటంతో భర్త వేణు రాత్రి 10.30 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చాడు. అయితే అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు పరిస్థితి క్లిష్టంగా ఉందని తిరుపతికి రెఫర్ చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో 108 వాహనం ద్వారా తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యలో ఏర్పేడు మండలం మేర్లపాక వద్ద ప్రసవ నొప్పులు ఎక్కువ కావడంతో 108 సిబ్బంది ప్రసవం చేసి పండటి బిడ్డకు ప్రాణం పోశారు. ఇక పుత్తూరు నుంచి చైతన్య అనే మహిళ ప్రసవ నొప్పులతో బాధపడుతూ శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి భర్త గోవర్థన్‌తో కలిసి సోమవారం వచ్చారు. మంగళవారం శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు పరీక్షించి తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఏమైందో ఏమో కాని తిరుపతికి రెఫర్ చేశారు. తాము వెళ్లలేమని చెబుతున్నా బలవంతంగా తిరుపతికి రెఫర్ చేశారు. గతంలో ఈ ఆస్పత్రిలో నెలకు సుమారు 150 నుంచి 200 ప్రసవాలు జరిగేవి. అయితే ఏడాది కాలంగా ఆసుపత్రి వైద్యసేవలు నానాటికి తీసికట్టు మారుతున్నాయి. ప్రస్తుతం నెలకు 30 కాన్పులు జరిగేవి కూడా కష్టంగా ఉంది. జిల్లా వైద్యాధికారులు స్పందించి ఆస్పత్రి వైద్యుల పనితీరుపై ప్రత్యేక దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు.