
.
నగరి/చిల్లకూరు : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంపై మాజీ మంత్రి ఆర్‌కే రోజా స్పందించారు. ఆదివారం మీడియాతో ఆమె మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ, జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పటికీ చిన్నచూపే అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను ఆపాలనుకోవడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపినట్టే అవుతుందని రోజా వ్యాఖ్యానించారు.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారని, ప్రజల్లో మాస్ ఇమేజ్ ఉన్న హీరో సినిమాను అడ్డుకోవాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. సినిమా బాగుంటే ఎవరూ అడ్డుకోలేరని, బాగోలేకపోతే ఎవరూ దాన్ని ఆడించలేరని స్పష్టం చేశారు. ఈ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాతో నిరూపితమైందన్నారు. టీడీపీ–జనసేన ఎమ్మెల్యేలు తలకిందులుగా తపస్సు చేసి, టికెట్లు ఫ్రీగా ఇచ్చినా కూడా హరిహర వీరమల్లు సినిమాను ఆడించలేకపోయారని గుర్తుచేశారు.
సినిమా ఫంక్షన్లల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తిట్టడం, సవాళ్లు చేయడం వంటివి జరిగితే గేమ్ ఛేంజర్ గానీ, హరిహరవీరమల్లు లాంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశామన్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేడని, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడని, ఆయన అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటున్న విషయం మనం చూస్తున్నామన్నారు.