
కాళంగి కన్నీరు!
● నదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ● నిర్మాణంలోని ఇళ్ల ముందు డంపింగ్ ● ట్రాక్టర్లతో తమిళనాడుకు తరలింపు
సూళ్లూరుపేట రూరల్ : కూటమి నేతల అధికారం అండతో రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా ఇసుక స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఇందుకోసం కాళంగి నదిని కన్నీరు పెట్టిస్తున్నారు. యంత్రాల సాయంతో ఇష్టారాజ్యంగా తవ్వేసి ఇసుకను సమీప గ్రామాల్లో నిర్మిస్తున్న ఇళ్ల ముందు డంప్ చేసుకుంటున్నారు. రాత్రివేళల్లో ట్రాక్ట ర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు.
డిమాండ్ అధికం
తడ, సూళ్లూరుపేట, దొరవారిసత్రం మండలాల్లో విస్తరించిన కాళంగి నదిలో నాణ్యమైన ఇసుక ఉంది. దీనికి ఇతర ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉంది. ఇది గుర్తించిన ఇసుకాసురులు నదిని తోడేస్తున్నారు. ప్రధానంగా ఇలుపూరు గ్రామం వద్ద నది పొర్లు కట్టను తవ్వి దారి ఏర్పాటు చేసుకుని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
రోజూ వందలాది ట్రాక్టర్లతో..
ఇలుపూరు గ్రామం నుంచి రోజూ వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. టీడీపీ నేతల కనుసన్నల్లో అక్రమార్కులు ఇసుకను యథేచ్ఛగా సరిహద్దులు దాటించి తమిళనాడుకు చేరుస్తున్నారు. దర్జాగా ఇసుక ట్రాక్టర్లును హైవేపైనే వెళుతుండడం గమనార్హం. కళ్ల ఎదుటే ఇసుక ట్రాక్టర్లు వెళుతున్నా హైవే పెట్రోలింగ్ సిబ్బంది సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం కొసమెరుపు.

కాళంగి కన్నీరు!