
దాడి కేసులో నిందితుల అరెస్ట్
దొరవారిసత్రం : మండలంలోని ఆనేపూడి సమీపంలో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వివరాలు.. పడమటికండ్రిగకు చెందని సమ్మన రాజయ్య, వడ్డికండ్రిగకు చెందిన వలిపి నారయ్య మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే రాజయ్యను కొట్టించేందుకు నారయ్య పథకం వేశాడు. ఈ మేరకు సూళ్లూరుపేటకు చెందిన నలుగురు మైనర్ బాలు రతో కలిసి ఆనేపూడి శివారులో కాపుకాసి రాజయ్యపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ అజయ్‌కుమార్ దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల రిమాండ్‌కు తరలించారు.
తల్లీబిడ్డల అదృశ్యంపై ఫిర్యాదు
సత్యవేడు: మండలంలోని మదనంబేడు దళితవాడలో తల్లీబిడ్డల అదృశ్యంపై పోలీసులకు ఆదివారం ఫిర్యాదు అందింది. వివరాలు.. నిత్య తన భార్య పూజ, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. రెండు రోజుల క్రితం భార్యాభర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన పూజ తన ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎస్‌ఐ రామస్వామి కేసు నమోదు చేశారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు 9440796767 నంబర్‌కు సమాచారం అందించాలని ఎస్‌ఐ కోరారు.
రెండు లారీలు ఢీ
– ముగ్గురికి గాయాలు
తొట్టంబేడు : శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. వెస్ట్‌బెంగాల్ నుంచి బెంగళూరుకు ఐరన్‌రాడ్ల లోడ్ లారీతో డ్రైవర్లు చాన్‌బాషా, జాకీర్ వస్తుండగా ఎదురుగా వచ్చిన మరో లారీ ఢీకొంది. ప్రమాదంలో చాన్‌బాషా, జాకీర్, మరో లారీ డ్రైవర్ గిరీష్ గాయపడ్డారు. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.