
నేటి నుంచి విద్యారంగ సమస్యలపై నిరసనలు
తిరుపతి సిటీ : జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు విద్యారంగ సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తీర్మానించింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, భగత్ రవి మాట్లాడుతూ తిరుపతి నగరంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల లేకపోవడం సిగ్గుచేటన్నారు. వసతి గృహాల్లో పిల్లలు వసతులులేక ఇబ్బందిపడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్యారంగంలో విప్లవం తీసుకువస్తామని మంత్రి లోకేష్ చెప్పిన మాటలు నీటిమూటలుగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.6,400కోట్ల స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం మెడలు వంచేలా విద్యార్థులు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్, వినోద్, తేజ, సభ్యులు శ్రీనివాస్, రవీంద్ర పాల్గొన్నారు.