
ఇదేం న్యాయం రక్షకా?
తిరుపతిలో సంచలనం రేపిన పవన్‌పై దాడి ఘటన
● దాడి చేసిన వారిని అరెస్ట్ చూపించని పోలీసులు ● దాడి చేయని వారిపై కక్ష సాధింపు చర్యలు ● అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమా?
తిరుపతి క్రైం: శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. తిరుపతిలో సంచలనం రేకెత్తించిన పవన్‌పై దాడి ఘటనలో జనసేన పార్టీకి చెందిన దినేష్ ప్రధాన ముద్దాయిగా ఉన్నా అతన్ని ఇంతవరకు అరెస్టు చూపించ లేదు. పవన్‌పై దాడి చేయకపోయినా ఏ2, ఏ3 నిందితులుగా చేర్చి అనిల్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడం చర్చనీయాంశంగా మారింది.
ఇంత బరితెగింపా..
పవన్‌పై దాడి ఘటనతో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి కుటుంబానికి ఏ మాత్రం సంబంధం లేదు. అయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ఆయన అనుచరులు బరితెగించారంటూ ఎల్లోమీడియా మూడు రోజులుగా విషం చిమ్ముతోంది. పచ్చి అబద్ధాలతో పైశాచిక ఆనందం పొందుతోంది. టీటీడీ చైర్మన్‌పై విమర్శలు చేసిన భూమన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎల్లో మీడియా కంకణం కట్టుకుంది. అధికార కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కార్యకర్త దినేష్ పవన్‌ను లాఠీతో చావగొట్టే వీడియో బయటకొచ్చినా అతనిపై చర్యల్లేవు. ఈ ఘటనలో ఇప్పటికే తిరుపతి ఈస్ట్ పోలీసులు ఎఫ్‌ఐఆర్– 368/25 కింద ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏ1గా దినేష్, ఏ2గా అనిల్‌కుమార్‌రెడ్డి, ఏ3 జగ్గారెడ్డి అండ్ అదర్స్ అంటూ కేసు కేసు నమోదు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏ2, ఏ3లుగా ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డి, జగ్గారెడ్డితో పాటు, ఏ1గా ఉన్న దినేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆపై ఏ2, ఏ3లుగా ఉన్న వారిని మాత్రమే రిమాండ్‌కు తరలించారు. ఏ1గా ఉన్న దినేష్‌ను ఇంతవరకు అరెస్టు చూపించలేదు. ‘నాపై దాడి ఘటనలో ఎవరి ప్రమేయం లేదు.. మీరు ఎందుకు అత్యుత్సాహం చూపిస్తున్నారు..’ అంటు భాదితుడు పవన్ వీడియోలు రిలీజ్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందనేది ఇప్పటి వరకు అర్ధంకాని ప్రశ్న. తిరుపతి ఎస్పీ ఆదేశాల మేరకు 9 ప్రత్యేక బృందాలును రంగంలోకి దిగడంతో చిత్తూరులో ఉన్న పవన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రస్తుతం తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనిచ్చిన సమాచారం మేరకు విచారణ మరింత వేగవంతం చేశారు.
వీటికి సమాధానం ఏదీ?
పవన్‌పై దాడి చేసిన దినేష్‌ను ఎందుకు రిమాండ్‌కు తరలించలేదు..?
చట్టప్రకారం ముద్దాయిని 24 గంటల్లోపు జడ్జి ముందు ప్రవేశపెట్టాలి. కానీ దినేష్‌ను తిరుపతి ఈస్ట్ పోలీసులు అరెస్ట్ చేసి 72 గంటలు దాటినా అరెస్టు చూపించకపోవడం వెనుక మతలబు ఏంటి?
పవన్‌పై దాడి చేసే సమయంలో దినేష్‌కు పైబర్ లాఠీ అందించిన కానిస్టేబుల్ ఎవరు?
వారితో పాటు ఉన్న మరొక కానిస్టేబుల్ కుమారుడు ఎవరు?
పవన్ స్టేట్‌మెంట్‌లో ఏం సమాచారం ఇచ్చాడు?
అతనితో సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయించింది ఎవరు?
సెల్ఫీ వీడియోలు విడుదల చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది..?
పవన్ గారడీ మాటలు ఎలా నమ్మాలి?
.. వీటిపై పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంది.

ఇదేం న్యాయం రక్షకా?