రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
తిరుపతి అర్బన్ : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అన్నిశాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి రహదారి భద్రతా కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హైవేపై ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే డ్రైవింగ్ చేయాలని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలపై సమగ్ర సమాచారం కోసం ఆడిట్ నిర్వహించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారుల్లో ఇప్పటి వరకు100 బ్లాక్‌స్పాట్లు గుర్తించినట్లు తెలిసిందని, దీనినై అధికారులు స్పష్టంగా నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే తిరుమల ఘాట్ రోడ్డులోకి ఫిట్‌నెస్ ఉండే వాహనాలను మాత్రమే అనుమతించాలన్నారు. అఆగే ఘాట్‌రోడ్డును నాన్‌స్టాప్ జోన్‌గా గుర్తించాలని ఆదేశించారు. మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేసి రూ.2వేల జరిమానా విధించాలని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగితే 1033 టోల్ ఫ్రీ నంబర్‌కు ప్రజలు కాల్ చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. హిట్ అండ్ రన్‌పై స్పష్టమైన నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని కోరారు. ఈ మేరకు బాధిత కుటుంబాలు ఇన్సూరెన్స్ పొందే వెసులుబాటు ఉంటుందని వివరించారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ జాతీయ రహదారులపై వెళుతున్న ద్విచక్రవాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలను తెలియజేయాలన్నారు. ప్రస్కూల్స్ బస్సులను ఆర్టీఓ అధికారులు తరచూ తనిఖీ చేయాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో కచ్చితంగా రూల్స్ పాటించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా రవాణాశాఖ అధికారి మురళీమోహన్, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఐ మధుసూదన్, తిరుపతి, నెల్లూరు, చైన్నె జాతీయ రహదారుల పీడీలు వెంకటేశ్వర్లు, ఎంకే చౌదరి, విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్, తుడా ఏఈ రవీంద్ర పాల్గొన్నారు.


