మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తాం
తిరుపతి అర్బన్ : మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జేసీ శుభం బన్సల్‌తో పాటు అధికారులు, వ్యాపారులు, ఫ్యాక్టరీ యజమానులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న మామిడి దిగుబడిని ఒక్కసారిగా కోతలు చేయకుండా దశల వారీగా చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఉద్యానశాఖ అధికారి దశరథరామిరెడ్డిని ఆదేశించారు. ఓ వైపు రైతులు, మరోవైపు వ్యాపారులు ఇంకో వైపు ఫ్యాక్టరీలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు వెల్లడించారు. ఆ మేరకు ఓ నివేదిక తయారు చేసి తమకు సమర్పించాలని ఉద్యానశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వ్యాపారులు మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల నుంచి విరివిగా జిల్లాకు మామిడి పండ్లు వస్తున్నాయని చెప్పారు. దాంతో తాము నష్టపోతున్నామని, వాటిని రాకుండా అడ్డుకట్ట వేయాలని కోరారు. అన్ని అంశాలను పరిశీలించి అందరికీ న్యాయం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులతో పాటు మైక్రో ఇరిగేషన్ అధికారి సతీష్ పాల్గొన్నారు.


