విదేశీ యూనివర్శిటీతో ఎంబీయూ ఒప్పందం
– అమెరికా యూనివర్శిటీతో ఎంఓయూ
చంద్రగిరి : దేశంలోనే మొట్ట మొదటి సారిగా విద్యార్థుల సౌలభ్యం కోసం విదేశాలకు చెందిన ప్రముఖ యూనివర్శిటీతో ఒప్పందం చేసుకున్నట్లు ఎంబీయూ ప్రో చాన్సలర్ మంచు విష్ణు తెలిపారు. గురువారం ఎంబీ యూనివర్శిటీలోని దాసరి ఆడిటోరియం ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది. ఈ మేరకు అమెరికాకు చెందిన పెన్ స్టేట్ విశ్వవిద్యాలయం చాన్సలర్ డాక్టర్ డేవిడ్ ఎం కాల్లెజో, వీసీ డాక్టర్ వాహిద్ మోటేపల్లిలతో ఎంబీయూ చాన్సలర్ డాక్టర్ మంచు మోహన్ బాబు ఎంఓఏ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రొ ఛాన్సలర్ మంచు విష్ణు అమెరికాకు చెందిన యూనివర్శిటీ చాన్సలర్, వీసీలతో కలసి ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు విశ్వవిద్యాలయం అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం చేసుకోవడం చారిత్రకమన్నారు. ఇదొక నూతన ఆవిష్కరణకు నాంది పలుకుతుందని, విద్యార్థులకు ఉత్తమ విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు. అమెరికాకు చెందిన యూనివర్శిటీతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా పలు కోర్సులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆయన తెలిపారు. కోర్సును బట్టి ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఇక్కడ విద్యనభ్యసించి, మిగిలిన విద్యను అమెరికాకు చెందిన పెన్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకునేలా ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. రెండు దేశాల్లోని యూనివర్శిటీల్లో ఒకటే సిలబస్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, ఉత్తమ విద్యను అభ్యసించే వారికి స్కాలర్‌షిప్‌లను అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంబీయూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ మహేశ్వరి, ప్రో వోస్ట్ నాగరాజ రామారావ్, వీసీ కరుణాకరన్ ఇతర అధికారులు, అధ్యాపకుల బృందం పాల్గొన్నారు.


