తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు
తిరుపతి అర్బన్: గురుపౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని తిరువణ్ణామలైకి జిల్లా నుంచి ఆది, సోమవారాలు 160 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేశారు. తిరుపతితోపాటు జిల్లాలోని పలు డిపోల నుంచి సర్వీసులను అందుబాటులో ఉంచినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
ప్రయివేటుకు ఆర్టీసీ విచారణ కేంద్రాలు
తిరుపతి అర్బన్: తిరుపతి సెంట్రల్ బస్టాండ్‌లోని ఆర్టీసీ విచారణ కేంద్రాలను ప్రభుత్వం ప్రైవేటుకు కట్టబెట్టింది. ఓ కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ వాళ్లకు బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు శనివారం నుంచి తిరుపతి బస్టాండ్‌లోని విచారణ కేంద్రాల నిర్వహణ వారి ఆధ్వర్యంలో సాగుతోంది. తిరుపతి బస్టాండ్ ఆధారంగా రోజూ లక్ష మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో తిరుపతి సెంట్రల్ బస్టాండ్ పరిధిలోని శ్రీహరి బస్టాండ్, శ్రీనివాస బస్టాండ్, పల్లె వెలుగు బస్టాండ్లలో ఒక్కో విచారణ కేంద్రం చొప్పున నిర్వహిస్తున్నారు. అయితే ఆర్టీసీ కండక్టర్లే విచారణ కేంద్రంలో పనిచేస్తున్నారు. ఇటీవల కండక్టర్ల కొరత ఉందంటూ ఓ కాంట్రాక్టర్‌కు విచారణ కేంద్రం బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు 14 మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకున్నారు. అయితే ఈ అంశంపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు.
మురళీనాయక్‌కు ఘన నివాళి
తిరుపతి సిటీ: దేశం కోసం కదనరంగంలో శత్రువులతో వీరోచితంగా పోరాడి అశువులు బాసిన భరతమాత ముద్దు బిడ్డ మురళీనాయక్‌కు ఘన నివాళి అర్పించారు. శనివారం ఎస్వీయూలో జరిగిన ఈ కార్యక్రమంలో జీజేఎస్ వ్యవస్థపక అధ్యక్షుడు మహేంద్రనాయక్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా దేశ భద్రత కోసం సరిహద్దుల్లో పోరాడి ప్రాణాలర్పించిన వీర జవాన్ శహీద్ మురళీనాయక్ ఆశయసాధనకు యువత నడుం బిగించాలన్నారు. ఆయన చూపిన అపార ధైర్యం, అంకితభావం, సేవా నిబద్ధత ఈ తరం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు.
విద్యుత్ బస్సు డ్రైవర్ల నిరసన
తిరుపతి అర్బన్: తిరుమలకు నడుస్తున్న విద్యుత్ బస్సు డ్రైవర్లకు సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో శనివారం అలిపిరి డిపో వద్ద మూడు గంటలపాటు నిరసన వ్యక్తం చేశారు. దీంతో తిరుమల భక్తులకు విద్యుత్ బస్సుల కొరత నెలకొంది. అనంతరం ఆర్టీసీ అధికారులు రెండు రోజుల్లో జీతాల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో తిరిగి యథావిధిగా విధులకు వెళ్లారు.
తిరువణ్ణామలైకి ప్రత్యేక బస్సులు


