30 స్టార్టర్ల చోరీ
శ్రీకాళహస్తి రూరల్/రేణిగుంట : శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాళెం, పుల్లారెడ్డి కండ్రిగలో శనివారం రాత్రి పలువురు రైతులకు చెందిన పొలాల్లో సుమారు 30 స్టార్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపరించారు. పది రోజుల క్రితం ఇదేవిధంగా 20 స్టార్టర్లను చోరీ చేసినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక స్టార్టర్ సెట్ రూ.7వేలు అవుతుందని వివరించారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారింగి దొంగలను పట్టుకోవాలని కోరుతున్నారు. అయితే స్టార్టర్ల చోరీపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రూరల్ పోలీసులు తెలిపారు.
తప్పిపోయిన బాలుడి గుర్తింపు
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్) : తిరుమలలో తప్పిపోయిన బాలుడిని రేణిగుంట మండలం మల్లవరంలో పోలీసులు గుర్తించారు. ఎస్ ఐ అరుణ్ కుమార్ రెడ్డి కథనం మేరకు .. తిరుమలలో కర్ణాటక రాయచూర్ జిల్లా ముద్గల్ గ్రామానికి చెందిన కృష్టప్ప కుమారుడు శ్రీనివాస్ (16) తప్పిపోయినట్లు తిరుమల టూటౌన్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు బాలుడిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు చేపట్టామని ఎస్‌ఐ తెలిపారు.
పంట పొలాలపై ఏనుగుల బీభత్సం
పాకాల: మండలంలోని గానుగపెంట పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం చినపాపయ్యగారిపల్లి గ్రామానికి చెందిన రైతు టీ.గురుదేవ్‌కి సంబంధించిన రెండు ఎకరాల వరి పంటను తొక్కి నాశనం చేశాయి. అలాగే పొలం చుట్టూ వేసిన కంచెను ధ్వంసం చేశాయి. రైతుకు సుమారు రూ.80 వేల వరకు నష్టం వాటిల్లింది. పక్కనే మరో రైతు సోమశేఖర్‌కు చెందిన అర ఎకరా వరి పంట, చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను నాశనం చేశాయి. రైతుకు రూ.40 వేల వరకు నష్టం చేకూరింది. ధనూజవారిపల్లి గ్రామానికి చెందిన రైతు కే.సురేంద్రరెడ్డి మామిడి తోట, ఫెన్నింగ్‌ను సర్వనాశనం చేయగా.. రూ.50 వేల వరకు నష్టం వాటిల్లింది. ఫారెస్ట్ అధికారులు స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
‘పోటు’ సహకార సంఘానికి ఎన్నికల
తిరుమల : శ్రీ వేంకటేశ్వర పోటు వర్కర్స్ సహకార సొసైటీ తిరుమల పాలకవర్గానికి ఆదివారం ఎన్నిక నిర్వహించారు. స్థానిక ఎస్వీ ఉన్నత పాఠశాలలో ఏడుగురు సభ్యుల కోసం నిర్వహించిన ఎన్నికలో 22 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 471 మందికి గాను 393 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్. సునీల్ కుమార్, జె.దివాకర్, పీవీ రామ్‌కుమార్, ఎన్.బాలాజీ, డి.శంకర్, పూజారి రఘు, నీటి వంశీకృష్ణ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి వి.సురేష్ బాబు ప్రకటించారు.
30 స్టార్టర్ల చోరీ
30 స్టార్టర్ల చోరీ


