అద్వితీయ పరిశోధనలకు అవకాశం
తిరుపతి సిటీ: అరుదైన మూలకాలపై అద్వితీయ పరిశోధనలకు మన దేశంలో అవకాశం పెరిగిందని కొచ్చిన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎం జునాయిడ్ బుషిరీ పేర్కొన్నారు. ఎస్వీయూ ఫిజిక్స్, పద్మావతి వర్సిటీ బయోటెక్నాలజీ విభాగాలు సంయుక్తంగా సైన్స్, టెక్నాలజీ అండ్ అప్లికేషనన్స్ ఆఫ్ రేర్‌ఎర్‌త్స్ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు బుధవారంతో ముగిసింది. ఎస్వీయూ సెనేట్ హాల్లో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. అరుదైన మూలకాలు దొరికే ప్రాంతాలను గుర్తించి, ప్రాసెసింగ్ చేసే పద్ధతులను మెరుగుపరుచుకోవాలన్నారు. సదస్సును అర్థవంతంగా చేపట్టిన నిర్వాహకులు ఫిజిక్స్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ దేవప్రసాదరాజు, ప్రొఫెసర్ జాన్ సుష్మాను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం సింహపురి వర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ విజయభాస్కరరావు మాట్లాడుతూ పరిశోధనలు కొత్త ధోరణిలో సాగేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించాలని సూచించారు. అనంతరం ఉత్తమ పోస్టర్ ప్రజెంటేషన్ చేసిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీయూ మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హుస్సేన్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పద్మావతి, ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి, ప్రొఫెసర్ విజయలక్ష్మి, డాక్టర్ దీపేంద్ర సింగ్, కార్యదర్శి డాక్టర్ ఎమ్మెల్పీ రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ సికే జయశంకర్ పాల్గొన్నారు.


