క్షేత్రం..జన సంద్రం
● శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల ఆదివారం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. టీటీడీ కూడా దీనికి తగినట్టుగా ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం చోటు చేసుకోకుండా భక్తులకు పాలు, పులిహోర వంటివి నిరంతరం పంపిణీ చేస్తోంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 78,821 మంది స్వామివారిని దర్శించుకోగా 33,568 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.36 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 20 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
క్యూలో భక్తులకు కుచ్చుటోపీ
శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు స్థానిక చిరువ్యాపారులు భక్తులకు తినుబండాలను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. క్యూలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిని అరికట్టాల్సిన విజిలెన్స్ సిబ్బంది మాత్రం చూసీచూడనట్లు వ్యవహరించడం గమనార్హం.
నారాయణగిరి షెడ్లలో అదనపు ఈఓ తనిఖీలు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో నారాయణగిరి షెడ్ల వద్ద టీటీడీ అదనపు ఈఓ సీహెచ్.వెంకయ్య చౌదరి ఆదివారం ఉదయం తనిఖీ చేశారు. క్యూలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ఇబ్బంది పడకుండా నిరంతరాయంగా అన్న ప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు రాజేంద్ర, హరీంద్రనాథ్, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు.


