నీటి గుంతలో పడి విద్యార్థిని మృతి
వరదయ్యపాళెం: పశువుల కాపరిగా వెళ్లిన ఇంటర్ విద్యార్థిని ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి దుర్మరణం చెందిన ఘటన మండలంలోని కువ్వాకొల్లి పంచాయతీ, లక్ష్మీపురం.కే గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు.. లక్ష్మీపురం.కే గ్రామానికి చెందిన సుబ్రమణ్యం, కామేశ్వరి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె శ్రీవల్లి (16) గూడూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతోంది. ఇటీవల ఫలితాల్లో ఆ విద్యార్థిని 345 మార్కులతో పాసైంది. గురువారం తమ పశువులను మేతకు తీసుకెళ్లింది. అయితే గ్రామ సమీపంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత ఏడాది పనులు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో నీరు నిల్వ చేరడంతో పశువులు ఆ గుంతల్లోకి దిగగా వాటిని బయటకు తోలేందుకు అటుగా వెళ్లిన విద్యార్థిని శ్రీవల్లి కాలుజారి గుంతలో పడిపోయింది. తల్లిదండ్రులు యువతి ఆచూకీ కోసం ఆ ప్రాంతమంతా గాలించారు. చీకటి పడడంతో విద్యార్థిని ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం నీటి గుంతలో శవమై తేలి ఉండడాన్ని స్థానికులు గుర్తించడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించి, తల్లిదండ్రులను ఓదార్చారు.


