ఉచిత ఇసుక ఊసే లేదు!
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీ అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండో దశ ఉచిత ఇసుకపై ఇప్పటికే కలెక్టరేట్‌లో అధికారులు నాలుగు పర్యాయాలు సమావేశాలు నిర్వహించారు. పది రోజుల్లోనే ఉచిత ఇసుక అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత రెండు వారాల్లో అన్నారు.. మొత్తంగా ఆరు నెలలుగా ఉచిత ఇసుక అందుబాటులోకి వస్తుందని చెబుతూనే ఉన్నారు. ఇదిగో అదిగో అంటూ ఇప్పటికే ఆరుసార్లు వాయిదాలు వేశారు. సమావేశాలు నిర్వహించడం.. ఏదో ఒక తేదీ చెప్పడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిపోయింది. మార్చి 11వ తేదీన కలెక్టరేట్‌లో మీటింగ్ నిర్వహించారు. అదే నెల 15వ తేదీ నుంచి రెండో దశ ఉచిత ఇసుక అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అయితే మరో నెల గడిచినా ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా సర్కార్ నేతృత్వంలో ఇసుక విక్రయాలు సాగడం లేదు. అంతా ప్రైవేటుగా అక్రమ వ్యాపారాలు మాత్రమే జరుగుతున్నాయి. అయితే వాటిని కట్టడి చేయడానికి మైనింగ్ అధికారులు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాయింట్లు కనుమరుగు
గత ఏడాది జూలై 8న జిల్లాలో ఇసుక పాలసీని వచ్చింది. అయితే రెండు నెలలకే అది కనుమరుగైంది. ఇసుక లేదంటూ ఆయా అధికారిక రీచ్‌లలో బోర్డులు తిప్పేశారు. ఆ తర్వాత గత ఏడాది అక్టోబర్ నుంచి రెండో దశలో భాగంగా జిల్లాలో గూడూరు వద్ద గూడలి సమీపంలో స్వర్ణముఖి వద్ద ఒక పాయింట్, పెళ్లకూరు మండలంలోని కలవకూరు వద్ద రెండు ఇసుక పాయింట్లు గుర్తించారు. ఈ మూడు పాయింట్లలో 1,37,686 టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయని వాటిని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పిన అధికారులు వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ప్రైవేటుగా కూటమి నేతలు యథేచ్ఛగా ఇసుక వ్యాపారం సాగిస్తూ రూ.కోట్లు పోగేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో అక్రమార్కులను ప్రశ్నించే వారే కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


