బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి

Mar 24 2025 6:47 AM | Updated on Mar 24 2025 9:21 AM

బైక్‌

బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి

రామచంద్రాపురం (తిరుపతి రూరల్‌): రామచంద్రాపురం మండలంలోని చిట్టతూరు సమీపంలో శనివారం రాత్రి బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడు శివకేశవులు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. శివకేశవులు కమ్మపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హిందీ మాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన శనివారం రాత్రి బైక్‌లో పచ్చికాపలం నుంచి స్వగ్రామమైన చిట్టతూరు గ్రామానికి బయలుదేరారు. చిట్టత్తూరు సమీపంలో బైక్‌ అదుపుతప్పి బోల్తా పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. శివకేశవులు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హిందీ టీచర్‌ మృతి విషయం తెలుసుకున్న కమ్మపల్లి జెడ్పీ హైస్కూల్‌ పిల్లలు పెద్ద సంఖ్యలో చిట్టత్తూరు చేరుకున్నారు. ఆయన భౌతిక దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏదైనా గుర్తు తెలియని వాహనం ఢీకొందా అన్న కోణంలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

చిట్టి చేతుల..‘స్వచ్ఛాంధ్ర’

నారాయణవనం:‘‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్రతో గ్రామాలు, మురుగుకాల్వలు శుభ్రంగా ఉండాలి.. ముందస్తు సమాచారం లేకుండా నేనే స్వయంగా గ్రామానికి వస్తాను.. పరిశుభ్రత లేకుంటే చర్యలు తప్పదు..’’ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలను అధికార యంత్రాంగం పట్టించుకోవడమూ లేదు. సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా స్పందించిన పాపానపోవడం లేదు. చివరకు విసిగి వేసారిన బాలలే నడుం బిగించి కదిలారు. పలకా బలపం, పుస్తకాలకు బదులు పారలు చేత బట్టారు. మురుగు కాలువలో దిగి, దుర్గంధం నడుమ వ్యర్థాలను తొలగించారు. ఆ పనుల మూలాన ఆ చిట్టి చేతులు, ఒంటికి, దుస్తులకు అంటిన కాలువ మురుగు కంపుతోనే ఇళ్లకు వెళ్లి స్నానం చేశారు. వివరాలు.. మండలంలోని గోవిందప్పనాయుడు కండ్రిగ దళితవాడ పాఠశాల సమీపంలో మురుగు కాలువ పారకుండా వ్యర్థాలతో నిండిపోయింది. అధికారులకు ఈ సమస్యపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో చివరకు బడి పిల్లలే ముందుకు కదిలారు. ఆదివారం ఆ ప్రాంతాలను శుభ్రం చేసి అధికారుల అలసత్వానికి చెంపపెట్టులా చేతల్లో చూపారు. ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకుని పంచాయతీ కార్యదర్శి విధులకు డుమ్మా కొడుతూ దురుసుగా పెత్తనం చేస్తున్నాడన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు మురుగు శుభ్రం చేయడంపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి!

విహారయాత్రలో విషాదం

చెట్టును ఢీకొన్న కారు

ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు

తడ : చైన్నె– నెల్లూరు జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్‌ఐ కొండపనాయుడు కథనం మేరకు.. చైన్నె ఇంజినీరింగ్‌ కళాశాలలో బీసీఏ మూడో సంవత్సరం విద్యార్థులు ఆదివారం వరదయ్యపాళెం సమీపంలోని ఉబ్బల మడుగు విహారయాత్రకు బయలుదేరారు. ఇందుకోసం ఓ కారుని అద్దెకు తీసుకుని డ్రైవర్‌తోపాటు 8 మంది తాంబరం నుంచి బయలు దేరారు. పెరియవట్టు గ్రామం వద్ద వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు దిగేసి చెట్టును ఢీకొంది. ప్రమాద సమయంలో కారు ముందు సీటులో ఉన్న సంబ్రిన్‌ ఫాతిమా(21) ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలు కావడంతో తమిళనాడుకు చెందిన 108 అంబులెన్స్‌లో తొలుత ఎళాఊరు ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చైన్నె స్టాన్లీ ఆస్పత్రికి తీసుకెళుతుండగా దిన(34) అనే మరో వ్యక్తి మృతి చెందాడు. కారు నడుపుతున్న మహమ్మద్‌ ఆవాజ్‌(26)తోపాటు యోగేశ్వరన్‌(20), బెంజమిన్‌(26), అలియా బేగమ్‌(23), శ్రీమాన్‌(20), మాదేష్‌(21) గాయపడ్డారు. ఫాతిమా మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దిన మృతదేహాన్ని స్టాన్లీ ఆస్పత్రిలోనే ఉంచారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి 1
1/3

బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి

బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి 2
2/3

బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి

బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి 3
3/3

బైక్‌ బోల్తాపడి ఉపాధ్యాయుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement