వైఎస్సార్‌సీపీ పాలనలోనే వెంకటగిరి
వెంకటగిరి (సైదాపురం) : వెంకటగిరి మున్సిపాల్టీలో వైఎస్సార్‌సీపీ పాలనే ఉంటుందని, పురపాలక సంఘం చైర్మన్‌గా నక్కా భానుప్రియ కొనసాగుతారని పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌జేఆర్ భవనంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత మున్సిపల్ ఎన్నికల్లో జగనన్న ఎంపిక చేసిన అభ్యర్థులు వైఎస్సార్‌సీపీ బీఫామ్‌తో మొత్తం 25వార్డుల్లోనూ విజయబావుటా ఎగురవేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలు మాయమాటలు చెప్పి కొందరు కౌన్సిలర్లును లోబర్చుకునేందుకు యత్నించినట్లు ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేరని, అయినప్పటికీ అసత్య ప్రచారంతో 16 మంది వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లతో సంతాకాలు చేయించుకుని అవిశ్వాస తీర్మానానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9వ తేదీన వెంకటగిరి మున్సిపాల్టీలో అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. దీనిపై 18 మంది కౌన్సిలర్లతో ప్రత్యేకంగా మాట్లాడామని, వారిలో ఏ ఒక్కరూ పార్టీని వీడేందుకు సుముఖంగా లేరని స్పష్టం చేశారు. టీడీపీ నేతలు దుర్మార్గపు ఆలోచనలతో తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానంలో నక్కా భానుప్రియ అఖండ విజయం సాధించి మున్సిపల్ చైర్మన్‌గా కొనసాగుతారని వెల్లడించారు.


