
సూసైడ్ నోట్ రాసి యువకుడి ఆత్మహత్య
బంజారాహిల్స్(హైదరాబాద్) : ‘అమ్మా..నాకు ఈ జీవితం నచ్చడం లేదు..నేను కోరుకున్న లైఫ్ ఇది కాదు.. నా జీవితాన్ని ఇంకోరకంగా ఊహించుకున్నా..ఇప్పుడు జరుగుతున్నది వేరేగా ఉంది..నాకు నచ్చని ఈ బతుకు ముగించాలనుకుంటున్నాను’ అంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వెస్ట్‌బెంగాల్‌కు చెందిన దేబష్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో నిర్మాణంలో ఉన్న మంత్రి కన్‌స్ట్రక్షన్స్‌లో క్వాలిటీ కంట్రోలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అదే ఆవరణలో గత కొంతకాలంగా ఒక గదిలో ఉంటున్నాడు. అయితే వారం రోజుల నుంచి అదోలా ఉంటూ.. తనకు ఈ జీవితం నచ్చడం లేదంటూ సహచర సిబ్బందితో వాపోయేవాడు. అనుకున్న విధంగా బతుకు కొనసాగడం లేదని అశాంతితో గడుపుతూ చివరకు తల్లికి సూసైడ్ నోట్ రాసి తాను ఉంటున్న గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.