
– కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
రుమటైడ్ ఆర్థ్రరైటిస్ వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాధి నిర్ధారణతో పాటు వైద్యంలో అధునాతన టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం నోవాటెల్ హోటల్‌లో సౌత్ జోన్ ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్(సిజ్రికాన్)2025లో భాగంగా డాక్టర్ విజయ ప్రసన్న నిర్వహించిన పేషంట్ సపోర్ట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణ అయిందని బాధ పడవద్దని పాజిటీవ్ థింకింగ్‌తో ముందుకు సాగాలని ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందని ఒకప్పుడు క్యాన్సర్ వస్తే చనిపోయే వారని అంతటి ప్రాణాంతక వ్యాధులకు కూడా ఇప్పుడు అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చి విజయవంతంగా రోగాన్ని జయిస్తున్నారని అన్నారు.
తాను కూడా తన తల్లి కోమటిరెడ్డి సుశీల ఫౌండేషన్ పేరుతో రోగులకు సహాయ సహకారాలు అందిస్తున్నానని అన్నారు. శ్రీమంతులు అయి ఉండి, సమాజంలో మంచి పొజీషన్‌లో ఉన్న వారు పేద వాళ్ళకు ఏదో ఒకటి చేయకపోతే అదో నేరంగా తాను భావిస్తానని అన్నారు. రుమటాలజీ సీనియర్ డాక్టర్ లీజా రాజశేఖర్ మాట్లాడుతూ రుమటాలజి వ్యాధుల గురించి చాలా మందికి అవగాహన లేదని ప్రాథమిక దశలోనే గుర్తించి మంచి వైద్యం అందించి వారిని మామూలువారిగా తయారు చేయవచ్చునని దాన్ని నిర్ధారించే లోపే చాలా మందిలో అది ముదిరిపోతున్నదని అది మరింత ప్రమాదకరంగా మారుతున్నదని అన్నారు.

ఈ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి సహకారం కావాలని, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇబ్బందులు పెడుతున్నాయని వారితో కూడా ప్రభుత్వం చర్చించాలని అన్నారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా వైద్యుల దృష్టికి, ఇన్సూరెన్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రుమటాలజి అసోసియేషన్ అద్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర, డాక్టర్ రాజ్ కిరణ్, డాక్టర్ రాజేంద్ర వర ప్రసాద్, డాక్టర్ వినోద్ రవీంద్రన్, డాక్టర్ పని కుమార్ తదితరులు పాల్గొన్నారు.